ఏపీకి మరో ముప్పు.. బంగాళాఖాతంలో అల్పపీడనం

|

Aug 12, 2020 | 10:26 AM

మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడింది. మరోవైపు తమిళనాడు తీరంలో నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ వరకు మరో ఉపరితల ఆవర్తనం..

ఏపీకి మరో ముప్పు.. బంగాళాఖాతంలో అల్పపీడనం
Follow us on

ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు జల కళ సంతరించుకుంది. గత రెండు రోజులుగా ఉత్తరాంధ్రలో అనేకచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఈ రోజు నుంచి మరో రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

కాగా, ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా ఇన్‌ఫ్లో వచ్చి చేరింది. జలాశయానికి 1,47,890 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. జూరాల ప్రాజెక్టు, హంద్రీనీవా నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. సుంకేసుల, హంద్రీ నుంచి ఎలాంటి వరద ప్రవాహం కిందికి చేరడం లేదు.

ఇదిలావుంటే.. మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడింది. మరోవైపు తమిళనాడు తీరంలో నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ వరకు మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఈనెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆతరువాత కోస్తాలో వర్షాలు పెరుగుతాయని పేర్కొంది. ఈనెల 14, 15 తేదీల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.