డిల్లీ: జెట్ ఎయిర్‌వేస్ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్న జెట్ యాజమాన్యం కనీసం తమ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతుంది. అయితే తమ ఇబ్బందులను దేశ ప్రధాాని దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు జెట్ ఉద్యోగులు. కొన్ని నెలలుగా తమకు జీతాలు అందడం లేదంటూ, సంస్థ నుంచి తమకు జీతాలు ఇప్పించాలంటూ జెట్ ఎయిర్‌వేస్ పైలట్లు ప్రధాని నరేంద్ర మోదీకి, పౌర విమాన యాన శాఖమంత్రి సురేశ్ ప్రభుకు లేఖ రాశారు.
‘జెట్ ఎయిర్‌వేస్ తీవ్ర సంక్షోబంలో కూరుకుపోయింది. అది ఇప్పుడు పూర్తిగా చేతులెత్తేసింది. మా కుటుంబాలు రోడ్డున పడేలా ఉన్నాయి. వేలాది మంది నిరుద్యోగులవుతారు. విమానయాన రంగ స్థితిగతులు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. దీంతో ప్రజలు ఈ రంగంపై విశ్వాసం కోల్పోతారు. విమాన టికెట్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. పైలెట్లు, ఇంజినీర్లు మూడు నెలలుగా జీతాల్లేకుండా పనిచేస్తున్నారు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి మానసిక క్షోభకు గురవుతున్నాం. మేము ఇన్ని ఇబ్బందులకు ఓర్చుకోని పనిచేస్తున్న యాజమాన్యం మా పట్ల కనీసం సానుకూల దృక్ఫదం చూపించడం లేదు. జెట్ ఎయిర్‌వేస్ యాజమాన్యానికి మీరు తగిన విధంగా సూచనలిచ్చి మా శాలరీస్ రిలీజ్ చేసేలా చర్యలు తీసుకోండి’ అని లేఖలో పేర్కొన్నారు.