నున్న లో హత్యకు గురైన విజయవాడ పోలీస్ కమిషనరేట్ అటెండర్ మహేష్ హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మహేష్ హత్యలో హరికృష్ణ పాత్రపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హరికృష్ణే మహేష్ ను కార్లో నున్న తీసుకెళ్లాడని చెప్పిన మహేష్ సోదరి విమల.. హరికృష్ణతో పాటు మరో నలుగురు మహేష్ స్నేహితులు నున్న వెళ్లారని వెల్లడించింది. మహేష్ పక్కనున్న ఇద్దరు స్నేహితులకు గూగుల్ పే ద్వారా మద్యం తెమ్మని హరికృష్ణ పంపించాడని.. ఆ సమయంలో ఇద్దరు దుండగులు రెక్కీ నిర్వహించి మహేష్ పై కాల్పులు జరిపారని ఆమె చెప్పింది. కాల్పుల అనంతరం వెళ్లిపోయేందుకు ప్రయత్నం చేస్తున్న దుండగులకు హరికృష్ణ కారు అప్పగించాడు.. ఆ కారు ను ముస్తాబాద్ వద్ద వదిలి దుండగులు పరారయ్యారని విమల పేర్కొంది.
మహేష్ మరో స్నేహితుడు దినేశ్ పై కూడా దుండగులు కాల్పులు జరిపారని విమల చెప్పింది. కాల్పులు జరపడానికి బైక్ పై వచ్చి కారు ఎందుకు వేసుకెళ్లారని ఆమె ప్రశ్నించింది. “మహేష్ కి వివాహం కాలేదు.. ఒక వైద్యురాలిని ప్రేమించి పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటున్నాడు. రెండు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నాం. హత్యకు, ప్రేమకు సంబంధం లేదు. ఇదంతా పక్క ప్లాన్ తో హత్య చేశారు” అని మహేష్ సోదరి విమల టీవీ9కు తెలిపారు.