
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ లో ఉండిపోయాయి. కరోనా ప్రభావంతో అన్ని రంగాలు స్తంభించి పోయాయి. ఫుడ్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగం కూడా ఆ ప్రభావానికి గురైంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆకలి చావులు ఎక్కువయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రోజుకు 3 లక్షల మంది మరణిస్తారని ఐక్యరాజ్యసమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల మంది చనిపోతారని తెలిపింది. అయితే, ఆకలి చావులు భారత్‌లో ఉండబోవని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
కాగా.. మరో రెండేళ్ల వరకు భారత్‌కు ఎలాంటి ఢోకా లేదని స్పష్టం చేసింది. దేశంలో సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయని, గత కొన్నేళ్లుగా రాష్ట్రాల్లో భారీగా ఆహార ఉత్పత్తులు పెరిగాయని, దాంతో ఇప్పట్లో ఎలాంటి సమస్య ఉండబోదని వివరించింది. మార్చి 1 నాటికి ఉన్న వివరాల ప్రకారం ఎఫ్‌సీఐ దగ్గర 309 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 275 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమ నిల్వలు ఉన్నాయి. అంటే మొత్తం 5.84 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు ఎఫ్‌సీఐ వద్ద నిల్వ ఉన్నాయి. ఇవి కాకుండా రాష్ట్రాల్లోని ప్రభుత్వాల వద్ద సొంత నిల్వలు ఉన్నాయి.
మరోవైపు.. దేశంలో పంజాబ్, హరియాణా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు గోధుమలను పెద్ద మొత్తంలో పండిస్తున్నాయి. అలాగే పంజాబ్, హరియాణా, ఏపీ, తెలంగాణ, ఛత్తీ్‌స్‌గఢ్, ఒడిసా రాష్ట్రాలు భారీగా వరిని పండిస్తున్నాయి. అంటే.. బియ్యం నిల్వలకు కూడా ఢోకా లేకుండా పోయింది. మరీ పంటలు తక్కువ ఉంటున్న ఈశాన్య రాష్ట్రాలు తప్ప ఎఫ్‌సీఐ నుంచి ఆహార ధాన్యాలను ఇతర రాష్ట్రాలు తీసుకోవడం లేదు. దీంతో ఎఫ్‌సీఐ వద్ద కొన్నేళ్లుగా ఆహార ధాన్యాల నిల్వలు పేరుకుపోయాయి. ఇప్పుడు ఆ నిల్వలే దేశానికి కలిసి వస్తాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.