నిర్భయ దోషులను ఉరి తీయడానికి రోజులు దగ్గర పడుతున్నాయి. ఫిబ్రవరి 1 వ తేదీ ఉదయం 6 గంటలకు ఈ నలుగురినీ ఉరి తీయనున్న సంగతి తెలిసిందే. మీ చివరి కోర్కె ఏమిటన్న తీహార్ జైలు అధికారుల ప్రశ్నకు వీరినుంచి ఎలాంటి సమాధానం రాలేదు. నిజానికి ఈ నెల 22 న ఈ దోషులను ఉరి తీయవలసి ఉన్న నేపథ్యంలో వీరికి అధికారులు సమన్లు జారీ చేశారు. కానీ వాటికి వీరు స్పందించలేదు.
ఈ నలుగురినీ వీరి కుటుంబాలు వారంలో రెండు సార్లు కలుసుకునేందుకు అనుమతించారు. కాగా.. వీరు ఆహారం తక్కువగా తింటున్నారని, టెన్షన్ గా ఉంటున్నారని తెలిసింది. రోజూ వీరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారి మెడికల్ రిపోర్టులు నార్మల్ గానే ఉన్నట్టు తెలిసింది. ఈ దోషుల సెల్స్ బయట ఇద్దరేసి చొప్పున గార్డులు అనుక్షణం కాపలా ఉంటున్నారట. అటు-తీహార్ జైలు అధికారులు ఇప్పటికే మూడు సార్లు డమ్మీ ఉరి ట్రయల్స్ నిర్వహించారు. ఈ నలుగురిలో ఇద్దరు ఎలాంటి క్యురేటివ్ పిటిషన్లు దాఖలు చేయలేదు.
ఆ జడ్జి సుప్రీంకోర్టుకు బదిలీ
ఇలా ఉండగా.. నిర్భయ దోషులు నలుగురికీ డెత్ వారెంట్లు జారీ చేసిన సెషన్స్ కోర్టు జడ్జి సతీష్ కుమార్ అరోరాను సుప్రీంకోర్టులో అదనపు రిజిస్ట్రార్‌గా నియమించారు. ఆయన ఏడాదిపాటు ఈ పదవిలో డిప్యుటేషన్‌పై ఉంటారు. నిర్భయ దోషులను త్వరగా ఉరి తీయాలంటూ ఆమె తల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను అరోరా విచారిస్తున్నారు. ఇక ఆయన బదిలీ అయ్యారు గనుక ఆయన స్థానే రానున్న కొత్త న్యాయమూర్తి ఈ పిటిషన్‌ను విచారించే అవకాశాలు ఉన్నాయి.