Anandaya Medicine: ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కరోనా చికిత్సకు ఆయుర్వేద మందు రెడీ అవుతుంది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య అందిస్తున్న కరోనా మందుకు ‘ఔషధచక్ర’అని పేరు పెట్టినట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఆనందయ్య మందుకు ప్రభుత్వం అనుమతిచ్చిన క్రమంలో దీన్ని ఆన్‌లైన్ ద్వారా పంపిణీ చేయడానికి సిద్ధమయ్యారు. జూన్ 7నుంచి ఆయుర్వేద మందు పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కృష్ణపట్నం పోర్టు వద్ద ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటికే తయారీకి అవసరమైన సామగ్రిని కృష్ణపట్నం పోర్టుకు తరలించే పనులు మొదలు పెట్టారు. ప్రస్తుతం కృష్ణపట్నం పోర్టుకు చెందిన సీవీఆర్ కాంప్లెక్స్‌లో మూలికలు, దినుసులు సిద్ధం చేసుకోవడంలో ఆనందయ్య బృందం బిజీగా ఉంది.
మూలికల సేకరణ పూర్తయిన తర్వాత మందు తయారీ ప్రారంభమవుతుంది. ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి సూచన మేరకు మొదట సర్వేపల్లి నియోజకవర్గంలో లక్షమందికి కరోనా రానివారు వాడే మందును అందచేయాలని ఆనందయ్య బృందం నిర్ణయించింది. అనంతరం కరోనా రోగులకు అవసరమైన పి, ఎల్, ఎఫ్ రకాల మందు పంపిణీ చేస్తారు. ఆ తర్వాతే ఇతర నియోజకవర్గాలకు పంపిణీ చేయాలని సంకల్పించారు. అయితే ఇప్పటికీ కూడా పలు ప్రాంతాల ప్రజలు కృష్ణపట్నం గ్రామానికి వస్తూనే ఉన్నారు.