“నువ్వెప్పుడైనా ప్రజల మద్ధతుతో గెలిచావా ?” సీపీఐ నేత నారాయణ పై మంత్రి పువ్వాడ అజయ్ ఫైర్
తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్.. సీపీఐ నేత నారాయణ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడుస్తుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ రోజున తన పై దాడి చేసిన....
తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్.. సీపీఐ నేత నారాయణ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడుస్తుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ రోజున తన పై దాడి చేసిన బీజేపీ నాయకులకు సీపీఐ నేత నారాయణ మద్ధతు ఇవ్వడం ఏంటని మంత్రి పువ్వాడ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ కార్యకర్తలు 200 మంది వరకు తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని, పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా ఉండడంతో తాను క్షేమంగా బయటపడ్డానన్నారు. ఈ విషయాలు తెలుసుకోకుండా తనను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ నేత నారాయణ కోరడం ఏంటని మండిపడ్డారు. నారాయణకు సాయం చేసిన వాళ్ళను మోసం చేయడం మాత్రమే తెలుసునని.. తన తండ్రి నుంచి సాయం పొంది ఆయనను రాజకీయాల్లో ఎదగకుండా అడ్డుకున్నాడని విమర్శించారు.
సీపీఐ నారాయణ టీవీ చానల్‌ను అమ్ముకొని, పార్టీలో కార్యకర్తలు, నాయకులు లేకుండా చేసి పార్టీని శూన్యం చేశాడన్నారు. ఇప్పటి వరకు నారాయణ ప్రజల మద్ధతుతో గెలవలేదని, కానీ తనను మాత్రం ఏ పార్టీలో ఉన్నా ప్రజలు ఆదరించి గెలిపించారన్నారు. 2006లో అధిక మెజారిటీ ఉన్న తన తండ్రిని రాజ్యసభకు వెళ్ళకుండా చేసాడని, ఆయన నుంచి సహయం పొంది ద్రోహం చేసాడన్నారు.” ఖమ్మం నుంచి 2018లో నన్ను ఓడించాలని చూశావు.. కానీ ప్రజలు నాపై నమ్మకంతో నన్ను గెలిపించారు. నారాయణ నీచ రాజకీయ జీవితం గురించి చెప్తే ప్రజలెవరు సహించరు” అని పువ్వాడ విమర్శించారు. 2009లో ఖమ్మం నుంచి తన తండ్రిని ఎంపిక చేస్తే, టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకొని దాన్ని అమ్ముకున్నాడని.. 2011లో మళ్ళీ తన తండ్రిని ఎమ్మెల్సీ కాకుండా అడ్డుకున్నాడంటూ నారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “నీ నీచ రాజకీయ బతకును ఎండబెడతా ? నీకు మా కుటుంబంతోనే సమస్య.. నాతో కాదు.. సీఎం కేసీఆర్ నాకు మంత్రి పదవి ఇస్తే నీకేందుకు భయం.. నీ నోరు అదుపులో పెట్టుకో” అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కూకట్ పల్లిలోని ఫోరం షాపింగ్ మాల్ వద్ధ మంత్రి పువ్వాడ అజయ్ కాన్వాయ్ పై దాడి జరిగింది. మంత్రి అజయ్ కారులో అక్రమంగా డబ్బు పంపిణీ చేస్తున్నారని కాన్వాయ్ పై ఓ యువకుడు కూర్చోగా, మరో యువకుడు కారు వెంట పడ్డాడు. బీజేపీ నేతలు పథకం ప్రకారమే తనపై దాడి చేశారని మంత్రి పువ్వాడ ఆరోపించారు. కాన్వాయ్ పై ఒక యువకుడు కూర్చోని ఉండగా, మరో యువకుడు పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు కారును వేగంగా ఎందుకు తీసుకెళ్ళారని సీపీఐ నేత నారాయణ తప్పుపట్టారు. ఆ సమయంలో ఎవరైనా చనిపోతే ఎలా అని ప్రశ్నించారు. మంత్రి కారులో అక్రమ నగదు లేకపోతే అంత వేగంగా ఎందుకు వెళ్ళారని అనుమానం వ్యకం చేశారు. వెంటనే సీఎం కేసీఆర్ మంత్రి పువ్వాడ అజయ్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాడు.