ముజఫర్‌పూర్ బాలికల ఆశ్రయ కేంద్రంలో జాడ తెలియని 11మంది బాలికలు హత్యకు గురయ్యారని సీబీఐ అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు బ్రజేష్ ఠాకూర్, అతడి అనుచరులు ఈ 11మంది దారుణంగా హత్య చేసి పాతిపెట్టారని సీబీఐ కోర్టుకు నివేదించింది. ఆశ్రయ కేంద్రం సమీపంలో గల శ్మశానం నుంచి ఆ బాలికల ఎముకల అవశేషాలను సేకరించామని.. హత్యకు గురైన చిన్నారుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చినట్లు సీబీఐ తన అఫిడవిట్‌లో పేర్కొంది.
అయితే గతేడాది మే నెలలో బయటపడిన ముజరాఫర్ షెల్టర్ హోమ్ ఘటనలో 40మంది బాలికలు అత్యాచారాలకు గురై చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నివేదిక బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వసతి గృహాన్ని నడుపుతోన్న బ్రజేష్ ఠాకూర్‌తో పాటు మరో 21మందిపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసి విచారణ చేస్తోంది.