ముంబై- పూణే-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్.. డీపీఆర్ పై కసరత్తు

దేశంలో మరో బుల్లెట్ ట్రైన్ కారిడార్ కు కేంద్ర సర్కార్ సన్నాహాలు మొదలుపెట్టింది. ప్రతిష్ఠాత్మక ముంబై- పూణే-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టును సిద్ధం చేస్తోంది.

ముంబై- పూణే-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్.. డీపీఆర్ పై కసరత్తు
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 28, 2020 | 7:30 PM

దేశంలో మరో బుల్లెట్ ట్రైన్ కారిడార్ కు కేంద్ర సర్కార్ సన్నాహాలు మొదలుపెట్టింది. ప్రతిష్ఠాత్మక ముంబై- పూణే-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టును సిద్ధం చేస్తోంది. అన్నీ అనుకూలిస్తూ వచ్చే యేడాది చివరికి పనులు ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. ఇందుకోసం నవంబర్‌ 5న ప్రీ బిడ్‌ సమావేశం ఏర్పాటు చేసింది కేంద్ర రైల్వే శాఖ. 711 కిలోమీటర్ల హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌పై సర్వే, ఉపరితలం, అండర్‌గ్రౌండ్‌ సదుపాయాలు, సబ్‌స్టేషన్లకు విద్యుత్‌ సరఫరా వంటి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ముంబై-పుణే-హైదరాబాద్‌ బుల్లెట్‌ ట్రైన్‌ కారిడార్‌కు టెండర్లను నవంబర్‌ 18న తెరుస్తారు.

టెండర్‌లో విజయవంతమైన బిడ్డర్‌ను గుర్తించి ఖరారు చేస్తారు. ఇక, ప్రభుత్వం మొత్తం ఏడు రూట్లలో బుల్లెట్‌ ట్రైన్‌ కారిడార్లను అభివృద్ధి చేయాలని భావిస్తుంది. ముంబై-పుణే-హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ-లక్నో-వారణాసి, ముంబై-నాసిక్‌-నాగపూర్‌, ఢిల్లీ-జబల్పూర్‌-అహ్మదాబాద్‌, చెన్నై-మైసూర్‌, ఢిల్లీ-చండీగఢ్‌-అమృత్‌సర్‌, వారణాసి-పాట్నా-హౌరా రూట్లలో బుల్లెట్‌ ట్రైన్‌ కారిడార్‌లను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. దేశంలో ఏడు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లపై సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)లను తయారు చేసే బాధ్యతను రైల్వే మంత్రిత్వ శాఖ నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌)కు అప్పగించింది.

ఇక, బుల్లెట్ ట్రైన్ కారిడార్లు అందుబాటులోకి వస్తే… అయా నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోతుంది. వ్యాపార, వాణిజ్యం మరింతగా పెరిగే అవకాశముంది.