Multiplex theaters opened in the city: దాదాపు ఎనిమిది నెలల తర్వాత విజయవాడ నగరంలో మల్టిప్లెక్సు థియేటర్లు తెరుచుకున్నాయి. ఆదివారం నుంచి మల్టిప్లెక్సుల్లో సినిమాల ప్రదర్శిన మొదలైంది. అయితే గతంలో మాదిరిగా రోజులు ఏడెనిమిది షోలు కాకుండా రోజుకు కేవలం మూడు షోలు మాత్రమే ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. టిక్కెట్ కౌంటర్లు (బాక్సాఫీసులు) కూడా కేవలం రెండు గంటల ముందు మాత్రమే ఓపెన్ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన పలు ఆంక్షలను పాటిస్తూ మల్టిప్లెక్సులను తెరిచేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో పలు ముందస్తు చర్యలు తీసుకున్న మల్టిప్లెక్సు యాజమాన్యాలు సినిమాల ప్రదర్శనను ఆదివారం ప్రారంభించారు.
కరోనా నేపథ్యంలో మార్చి 15వ తేదీన మూత పడిన మల్టిప్లెక్సు థియేటర్లు ఎట్టకేలకు సుమారు ఎనిమిది నెలల తర్వాత తిరిగి తెరుచుకున్నాయి. కేంద్ర హోం శాఖ సూచించినట్లుగా కేవలం 50 శాతం సీట్లకు మాత్రమే టిక్కెట్లను విక్రయించనున్నారు. రెండు గంటల ముందు మాత్రమే బాక్సాఫీసులు తెరిచి టిక్కెట్ల జారీ మొదలవుతుంది. రోజుకు కేవలం 3 షోలను మాత్రమే ప్రదర్శించనున్నారు. క్యాష్ లెస్ ట్రాన్సక్షన్స్, పేపర్ లెస్ టికెట్లతో నడవనున్నాయి మల్టీప్లెక్సులు.
సినిమా చూసేందుకు వచ్చే ప్రతి ప్రేక్షకుడి ఫోన్ నెంబర్ కంప్యూటర్‌లో సేవ్ చేసేందుకు యాజమాన్యాలు ఏర్పాట్లు చేశాయి. మాస్కులు లేకుండా సినిమా చూసేందుకు వచ్చే ప్రేక్షకులకు మాస్కులు సరఫరా చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాట్లు చేసిన యాజమాన్యాలు కేంద్ర సూచించిన, రాష్ట్రం నిర్దేశించిన మార్గదర్శకాలన్నింటినీ పాటిస్తున్నామని తెలిపాయి.
ALSO READ: పోలవరం ప్రొగ్రెస్ మా ఘనతే: చంద్రబాబు