తమిళనాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భర్త మందలించాడని మనస్తాపంతో ఒకటిన్నరేళ్ల కుమారుడితో తల్లి ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది.. స్థానిక పుళల్ సమీపం కన్నడ పాళయం జీవా 2వ వీధికి చెందిన రంజిత్‌కుమార్ పుళల్‌లో ఉన్న లారీ బుకింగ్ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన రెడ్‌హిల్స్ సమీపం సామియార్‌మఠంకు చెందిన భాగ్యలక్ష్మి(22)ని రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వీరికి మిత్రన్ అనే ఒకటిన్నరేళ్ల బాలుడు కూడా జన్మించాడు. రెండ్రోజుల క్రితం అల్లరి చేస్తున్నాడంటూ భాగ్యలక్ష్మి కుమారుడిని కొట్టింది. దీంతో ఆగ్రహించిన రంజిత్‌కుమార్ భార్యను కొట్టినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో, శుక్రవారం ఉదయం రంజిత్‌కుమార్ విధులకు వెళ్లాడు. సాయంత్రం 6 గంటల సమయంలో భర్తకు ఫోన్ చేసిన భాగ్యలక్ష్మికి భర్త రంజిత్ దురుసుగా సమాధానం చెప్పి ఫోన్ కట్ చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భాగ్యలక్ష్మీ తల్లి శాంతి ఇంటికి వెళ్లిపోయింది. అయితే, ఇంట్లోకి వెళ్లిన భాగ్యలక్ష్మీ తలుపులు మూసి ఉండడం, ఎంత పిలిచినా సమాధానం లేకపోవడంతో అనుమానించిన తల్లి శాంతి ఇరుగుపొరుగు వారి సాయంతో తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లింది. అంతలోనే మిత్రన్‌తో పాటు భాగ్యలక్ష్మి ఉరేసుకొని విగతజీవులుగా కనిపించారు. స్థానికుల సమాచారం మేరకు పుళల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్టాన్లీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు రంజిత్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.