ఎలుగుబంటి పగ.. ఇద్దరు హతం..!

కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తన పిల్లలను దారుణంగా చంపిన ఇద్దరిని ఓ ఎలుగుబంటి వెంటాడి మరీ చంపేసింది.

ఎలుగుబంటి పగ.. ఇద్దరు హతం..!

Updated on: Jun 15, 2020 | 4:50 PM

కన్న బిడ్డలను కళ్ల ముందే చంపితే మనిషి అయినా జంతువైనా సహించలేదు. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తన పిల్లలను దారుణంగా చంపిన ఇద్దరిని ఓ ఎలుగుబంటి వెంటాడి మరీ చంపేసింది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
విదర్భ జిల్లాలోని అకోలాలో నిమ్‌ఖేడీ గ్రామానికి చెందిన అశోక్‌ గావ్టే(52), మానా(42) జంతువులను వేటాడే అలవాటు ఉంది. ఇదే క్రమంలో మెల్గాట్ టైగర్ రిజర్వ్‌లోని అకోట్ వైల్డ్‌లైఫ్ డివిజన్‌లోకి అక్రమంగా ప్రవేశించారు. వీరి కంటబడ్డ రెండు ఎలుగుబంటి పిల్లలను గొడ్డలితో నరికి చంపేశారు. ఇది గమనించిన తల్లి ఎలుగుబంటి వీరిద్దర్నీ వెంబడించి మరీ చంపేసి ఉంటుందని అధికారులు తెలిపారు.
అయితే, ఇంటి నుంచి వెళ్లిన అశోక్, మానా ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిద్దరూ వైల్డ్‌లైఫ్ డివిజన్ వైపు వెళ్లారన్న స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అటవీ అధికారుల సాయంతో గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలో డివిజన్‌లోని 375వ కంపార్ట్‌మెంట్ వద్ద ఇద్దరి శవాలను గుర్తించామని అటవీ అధికారులు తెలిపారు. వారికి 15 మీటర్ల దూరంలో రెండు ఎలుగుబంటి పిల్లలు పడి ఉన్నాయని అధికారులు తెలిపారు. వీరిద్దరూ పిల్లలను చంపేయడంతో తల్లి ఎలుగుబంటి ఆ ఇద్దరిపై దాడి చేసి చంపేసి ఉంటుందని అటవీ అధికారులు తెలిపారు. ఎలుగుబంట్లు తమ పిల్లలను ప్రాణంలా చూసుకుంటాయని అవి చనిపోవడంతో తట్టుకోలేక దాడి చేసి ఉంటుందని అటవీ అధికారులు స్పష్టం చేశారు.