ఇప్పటికే గత వారం రోజులుగా పదిహేడు రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఇందులో మన తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థంగా మారిపోయింది. ఇవాళ కూడా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్‌లో తెల్లవారుజామునుంచే పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే ఓ వైపు ఈ వర్షాలకే జనం ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటే.. వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్తను తెలిపింది. దక్షిణాది రాష్ట్రాలను ముంచెత్తేందుకు “హికా” తుపాన్ దూసుకొస్తుందని వెల్లడించారు. ఇప్పటికే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏర్పడింది. ఇక హికా తుపాన్ కూడా దూసుకొస్తుండటంతో.. మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురిసేలా ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. కొన్ని చోట్ల.. చెరువులు తెగి, పంటలు నీట మునిగి, వాగులు పొంగి పొర్లుతుండటంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక నగరంలో అయితే రోడ్లపై నీరు నిలవడంతో.. భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా పదిహేడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. హికా తుపాను ప్రభావంతో.. అరేబియా సముద్ర తీరంలో గంటకు 75 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులెవరూ.. చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
రాగల 24 గంటల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళలోనూ భారీ వర్షాలు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటు ఉత్తర భారతంలోనూ వర్షాలు ముంచెత్తనున్నాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, విదర్భ, ఛత్తీస్‌ఘడ్, వెస్ట్ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో కుంభవృష్టి కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అసోం, మేఘాలయ, మహారాష్ట్ర, గోవాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నన్నాయని… బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగులు కూడా పడే అవకాశముందన్నారు.