
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గరపడుతన్న కొద్దీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి మార్పులుంటాయో ఎవరికీ అర్ధం కావడం లేదు. పార్టీ జంపింగ్ లు, సీట్లు రాని వారు అనేక ఆరోపణలు చేయడం, సొంత పార్టీల్లో గ్రూపు తగాదాలు.. ఇలా ఒక్కోచోట ఒక్కో పరిస్థితి నెలకొంది. మరోవైపు పొత్తుల వల్ల తమకు సీటు రాదనుకునే నేతలు సైతం పక్కపార్టీల వైపు చూస్తున్నారు. ఇక అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకూ 60 మందికి పైగా అసెంబ్లీ ఇంచార్జిలను మార్పు చేసింది. అసలు వైసీపీ ఇంచార్జిల మార్పు ప్రక్రియ ప్రారంభం అయింది మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి రాజీనామాతోనే. డిసెంబర్ 11 వ తేదీన తన ఎమ్మెల్యే పదవితో పాటు వైఎస్సార్ సీపీ ప్రాధమిక సభ్యత్వానికి ఆళ్ల రామకృష్ణా రెడ్డి రాజీనామా చేసారు. 2014,2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు మంగళగిరి ఎమ్మెల్యేగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల్లో గెలిచారు. రాజధాని ప్రాంతంలో ఆ పార్టీకి కీలకనేతగా కొనసాగారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఓడించారు. అమరావతిలో అనేక కుంభకోణాలు జరిగాయంటూ చంద్రబాబుపై కోర్టుల్లో కేసులు వేసి న్యాయపోరాటం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి అత్యంత విధేయుడిగా ఆళ్ల రామకృష్ణా రెడ్డి కొనసాగారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ ఉన్నట్లుండి రాజీనామా ప్రకటన చేశారు గతేడాది డిసెంబర్ 11వ తేదీన అసెంబ్లీకి వెళ్లి తన రాజీనామా లేఖను స్పీకర్ చాంబర్ లో అందించారు. ఆళ్ల రామకృష్ణా రెడ్డి తీసుకున్న నిర్ణయం అప్పట్లో రాజకీయంగా సంచలనంగా మారింది. ఆర్కే రాజీనామాను ప్రతిపక్షాలు తమకు అస్త్రంగా మార్చుకున్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి తిరిగి సొంతగూటికి చేరనున్నారు.
సొంతగూటికి చేరుకున్న మంగళగిరి ఎమ్మెల్యే
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ గూటికి చేరారు. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నది ఆళ్ల రామకృష్ణా రెడ్డి. అప్పటి నుంచి షర్మిలతోనే నడుస్తానని ప్రకటించారు. తన కుమారుడు పెళ్లి శుభలేఖ ఇచ్చేందుకు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి షర్మిల వచ్చిన సమయంలో ఆమె వెంట ఆళ్ల రామకృష్ణా రెడ్డి కూడా అక్కడికి వచ్చారు. అయితే వైసీపీని వీడినప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఎప్పుడూ వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆళ్ల రామకృష్ణా రెడ్డి మంగళగిరి నుంచి బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత నరసరావు పేట స్థానం నుంచి ఆర్కే పోటీలో ఉంటారని కూడా చర్చ జరిగింది. అయితే ఆర్కే మాత్రం పార్టీలో యాక్టివ్ గా లేకుండా మౌనంగా ఉండిపోయారు. మరోవైపు ఆళ్ల రామకృష్ణా రెడ్డి పార్టీని వీడటంతో అక్కడ ఇంచార్జిగా గంజి చిరంజీవికి బాధ్యతలు అప్పగించింది వైఎస్సార్ సీపీ అధిష్టానం.
విజయసాయిరెడ్డి మంతనాలతో..
ఆర్కే పార్టీ వీడినప్పటి నుంచి ఆయనతో ముఖ్య నేతలు సంప్రదింపులు చేస్తున్నారు. అయితే గత నాలుగైదు రోజులుగా ఆర్కే తో ఎంపీ విజయసాయిరెడ్డి మంతనాలు జరిపారు. విజయసాయిరెడ్డి ప్రస్తుతం గుంటూరు జిల్లా వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ గా ఉన్నారు. కొంతకాలంగా మంగళగిరిలో గెలుపుపై సాయిరెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. దాంట్లో భాగంగానే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తో మంతనాలు జరిపినట్లు తెలిసింది. చివరకు ఆర్కేతో జరిపిన మంతనాలు సక్సెస్ కావడంతో తిరిగి ఆయన వైసీపీ గూటికి చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆర్కే రాకతో మంగళగిరిలో పార్టీకి
పాత రోజులు వస్తాయని వైసీపీ నేతలు చెబుతున్నారు.