ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఊరట కల్పించింది. శాసనసభ్యుల విజ్ఞప్తి మేరకు 131 జీవోను సవరిస్తూ.. రేపే జీవోను విడుదల చేస్తామని రాష్ర్ట ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శాసనసభ వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి ప్రజల పట్ల గౌరవం ఉన్నది కాబట్టే మొన్న తీసుకువచ్చిన 131 జీవోను సవరిస్తామన్నారు. గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాటి వాల్యూకు అనుగుణంగా సవరించిన జీవోను గురువారం విడుదల చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. రిజిస్ట్రేషన్ సమయంలో ఉన్న మార్కెట్ విలువ ప్రకారమే రుసుం వసూలు చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
అనధికారిక లే అవుట్లలో తెలియక ప్లాట్లను కొనుగోలు చేసిన వారంతా ఎల్‌ఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకోవచ్చని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు ఉన్న అనధికారిక ప్లాట్లు, లే అవుట్ల క్రమబద్ధీకరణకు ఇదే మంచి అవకాశమని మంత్రి కేటీఆర్ ఇటీవలే ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబర్ 15వ తేదీ వరకు అందుబాటులో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్ స్కీమ్‌ని సద్వినియోగం చేసుకుంటే.. యాజమానులు భూములపై సర్వహక్కులతోపాటు ప్రభుత్వపరంగా మౌలిక సదుపాయాలను పొందడానికి అర్హులవుతారని వెల్లడించారు. వచ్చే అక్టోబర్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకున్న వారు క్రమబద్ధీకరణ ఫీజును వచ్చే ఏడాది జనవరి 31లోపు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ స్థలాలు, అర్బన్ ల్యాండ్ సీలింగ్ మిగులు భూములు, దేవాదాయ భూములు, చెరువుల శిఖం భూముల్లోని ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్ స్కీమ్ వర్తించదని మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు.