
జీఎస్టీ చట్ట ప్రకారం రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన పరిహారాన్ని కేంద్రమే అప్పు తీసుకుని చెల్లించాలని తెలంగాణ ఆర్ధికశాఖ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కొవిడ్ పరిస్థితుల్లో ఈ మొత్తం రాష్ట్రాలకు అత్యంత అవసరం అని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జీఎస్టీ(GST) కౌన్సిల్ సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన 42వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ర్టాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. బీఆర్కే భవన్ నుంచి తెలంగాణ తరపున ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు.
ఇప్పటికే సెస్ రూపంలో కౌన్సిల్‌కు జమ అయిన 30 వేల కోట్లు వెంటనే రాష్ట్రాలకు విడుదల చేయాలని హరీష్‌రావు డిమాండ్‌చేశారు. ఇప్పటికే మూడు ఇన్‌స్టాల్‌మెంట్స్ గత ఆరు మాసాల నుంచి పెండింగ్‌లో ఉన్నాయని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఆత్మనిర్భర్ ప్యాకేజీ కింద రాష్ట్రాలకు ఇచ్చిన రుణ పరిమితికి జీఎస్టీ పరిహారం చెల్లింపులకు ముడిపెట్టవద్దని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. జీఎస్టీ కింద రాష్ట్రాలకు రావాల్సిన మొత్తాన్ని వెంటనే చెల్లించాలన్నారు హరీష్‌రావు.
2017- 18 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఐజీఎస్టీ 24వేల కోట్లు కన్సాలిడేటెడ్ ఫండ్‌లో జమ చేశారని, అందులో తెలంగాణకు 2, 638 కోట్లురావాల్సి ఉందన్నారు. ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఆప్షన్లేవీ తమకు సమ్మతం కాదన్నారు. కేంద్రం రాష్ట్రాల ముందు ఉంచిన ప్రతిపాదనల్లో రాష్ట్రాలే అప్పులు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కేంద్రం వాటిని రాష్ట్రాలకు చెల్లిస్తామని చెబుతోంది. అయితే బీజేపీయేతర రాష్ట్రాలు కేంద్రం ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రమే ఆర్బీఐ నుంచి రుణం తీసుకొని జీఎస్టీ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి.
తెలంగాణకు రూ. 2,638 కోట్ల ఐజీఎస్టీ నిధులు రావాల్సి ఉంది. అలాగే.. జీఎస్టీ పరిహారంగా మరో 5 వేల కోట్లకుపైగా బకాయిలు రావాలి. అంటే …రెండూ కలిపి సుమారు 8 వేల కోట్ల రూపాయల బకాయిలు తెలంగాణకు రావాల్సి ఉందని ప్రభుత్వం చెబుతోంది.