AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వార్‌ ఎఫెక్ట్‌.. భారీగా పెరిగిన చమురు ధరలు! భారత్‌పై ప్రభావం?

మధ్యప్రాచ్యంలో తీవ్రమవుతున్న ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు ప్రపంచ చమురు మార్కెట్లను కుదిపేశాయి. బ్రెంట్ ముడి చమురు ధరలు 10 శాతం పెరిగి 78.52 డాలర్లకు చేరాయి. హార్ముజ్ జలసంధి ద్వారా చమురు సరఫరాకు చిన్న అంతరాయం కూడా ధరలను 150 డాలర్లకు చేర్చవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వార్‌ ఎఫెక్ట్‌.. భారీగా పెరిగిన చమురు ధరలు! భారత్‌పై ప్రభావం?
Crude Oil
SN Pasha
|

Updated on: Mar 02, 2026 | 2:06 PM

Share

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ చమురు మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ హత్య అనంతరం ఇరాన్–అమెరికా మధ్య సైనిక ఉద్రిక్తతలు పెరగడంతో బ్రెంట్ ముడి చమురు ధరలు ఒక్కసారిగా దాదాపు 10 శాతం పెరిగాయి. తాజా ట్రేడింగ్‌లో బ్రెంట్ బ్యారెల్ ధర 78.52 డాలర్ల వరకు చేరింది. బ్యాంకింగ్, మార్కెట్ నిపుణుడు అజయ్ బగ్గా ప్రకారం.. ఈ సంక్షోభంలో ప్రధాన అంశం సైనిక ఆధిపత్యం కాదని, ఎనర్జీ లాజిస్టిక్స్ అని చెప్పారు. ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించే హార్ముజ్ జలసంధి ద్వారా రోజుకు సుమారు 20–22 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా అవుతుందని ఆయన గుర్తుచేశారు. ఈ మార్గంలో చిన్న అంతరాయం కూడా బీమా ప్రీమియంలు, రవాణా ఖర్చులు, ముడి చమురు ధరలను గణనీయంగా పెంచుతుందని హెచ్చరించారు.

ఇప్పటికే మార్కెట్లు యుద్ధ ప్రమాద బీమా ఖర్చులు, ట్యాంకర్ మార్గమార్పులు, నావికాదళ ఎస్కార్ట్ ఖర్చులు పెరుగుతున్న సంకేతాలు చూపుతున్నాయని బగ్గా చెప్పారు. పరిస్థితి మరింత దిగజారితే బ్రెంట్ చమురు ధరలు బ్యారెల్‌కు 100–115 డాలర్లకు చేరవచ్చని, సముద్ర రవాణా అంతరాయం జరిగితే 120–140 డాలర్ల వరకూ ఎగిసే అవకాశం ఉందని అంచనా వేశారు. హార్ముజ్ పూర్తిగా మూసివేత వంటి అత్యంత ప్రతికూల పరిస్థితిలో ధరలు 150 డాలర్లను కూడా దాటవచ్చని హెచ్చరించారు.

భారత్ వంటి చమురు దిగుమతి ఆధారిత దేశాలకు ఇది ప్రత్యక్ష దెబ్బగా మారవచ్చని ఆయన చెప్పారు. చమురు ధర ప్రతి 10 డాలర్లు పెరిగితే భారత కరెంట్ అకౌంట్ లోటు GDPలో సుమారు 0.4–0.5 శాతం పెరుగుతుందని, CPI ద్రవ్యోల్బణం 30–40 బేసిస్ పాయింట్లు పెరగవచ్చని అంచనా. విమానయానం, ఆటో, రసాయనాలు, పెయింట్స్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై ఒత్తిడి పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగితే, అది పరోక్షంగా అన్ని నిత్యావసర ధరలపై కూడా ప్రభావం చూపుతాయి. ఇప్పటికే అధిక ధరలతో అల్లాడుతున్న సామాన్యు ప్రజలపై ఈ యుద్ధం కారణంగా మరింత పెను భారం పడనుంది. అయితే అప్‌స్ట్రీమ్ ఆయిల్ కంపెనీలు, రక్షణ రంగం, డాలర్ బలంతో IT రంగం, బంగారంతో సంబంధిత పెట్టుబడులు లాభపడే అవకాశముందని విశ్లేషణ. భౌగోళిక రాజకీయ ప్రమాదాలు ఇప్పుడు తాత్కాలికం కాకుండా నిర్మాణాత్మకంగా మారాయని బగ్గా హెచ్చరిస్తూ, పెట్టుబడిదారులు USD 120 చమురు పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పోర్ట్‌ఫోలియోలను స్ట్రెస్ టెస్ట్ చేయాలని సూచించారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us