Mayawati Statues at Dalit Memorials : మాయావతి విగ్రహాలు మరోసారి తెరమీదికి వచ్చాయి. ఇంత కాలం కనిపించని విగ్రహాలు సడన్ కనిపించడంతో అంతా షాక్ అవుతున్నారు. మాయావతి పాలన సమయంలో ఈ విగ్రహాల ఏర్పాటుపై పెద్ద రచ్చ జరిగింది. అప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం రేగింది.
తాజాగా లక్నోలోని లాల్ బహుదూర్ శాస్త్రి మార్గంలో ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ పార్టీకి చెందిన ప్రేరణ కేంద్రంలో మూడు మాయావతి పాలరాతి విగ్రహాలు ఏర్పాటు చేయడాన్ని స్థానికులు గురువారం గుర్తించారు. బీఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రేరణ కేంద్రాన్ని మాయావతి నిర్మించారు.
అయితే ఇందులో ఆమె విగ్రహాల ఏర్పాటు పనులు చాలా కాలంగా జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఎవరూ గుర్తించలేదు. బీఎస్పీ ప్రేరణ కేంద్రంలోని మూడు వైపులా ఏర్పాటు చేసిన మాయావతికి చెందిన మూడు పాలరాతి విగ్రహాలు ఇప్పడు బయటకు కనిపిస్తున్నాయి. లక్నోతోపాటు నోయిడాలోని పార్కుల్లో భారీ ఏనుగులు, విగ్రహాలను మాయావతి గతంలో ఏర్పాటు చేశారు. ఉత్తర ప్రదేశ్ లో ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. మరోసారి రాజకీయ దుమారం సృష్టించేందుకే ఇలా ప్లాన్ చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.