మహారాష్ట్రలోని ధూలే జిల్లా సెషన్స్ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఘర్‌కుల్ హౌసింగ్ కుంభకోణంలో శివసేన నేత, మాజీ మంత్రి సురేష్ జైన్‌కు రూ.100 కోట్ల జరిమానాతో పాటు ఏడేళ్ల పాటు జైలుశిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి సృష్టి నీల్‌కాంత్ తీర్పు వెలువరించారు. ఈ కుంభకోణంతో సంబంధమున్న మరో మాజీ మంత్రి, ఎన్సీపీ నేత గులాబ్‌రావ్ దేవోకర్‌కు ఐదేళ్లు, మరో 46 మందికి 3 నుంచి 7 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో తీర్పు సమయంలో మొత్తం 48 మంది నిందితులు కోర్టుకు హాజరయ్యారు.
1990లో హోంమంత్రిగా ఉన్న సమయంలో సురేష్ జైన్.. రూ.29 కోట్ల హౌసింగ్ ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. ఈ కుంభకోణంతో ఎన్సీపీ నేత సురేష్ జైన్‌తో పాటు కొందరు మున్సిపల్ కౌన్సిలర్లకు సంబంధం ఉందని అభియోగాలు నమోదయ్యాయి. ఆ సమయంలో బిల్డర్లకు అనుకూలంగా వ్యవహరించడంతో పాటు రూ.29 కోట్ల మేర అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై జలగాం మాజీ మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ గేడం 2006లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. జలగాం శివారులో మొత్తం 5 వేల ఇళ్లు పూర్తి చేయాల్సి ఉండగా..
కేవలం 1,500 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో సురేష్ జైన్ 2012 మార్చిలో అరెస్టు కాగా, ఎన్సీపీ నేత గులాబ్‌రావ్ దేవోకర్ అదే ఏడాది మే నెలలో అరెస్టయ్యారు. గులాబ్‌రావ్ మూడేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదలయ్యారు. 1995-2000 ఈయన జలగాం మున్సిపల్ కౌన్సిలర్‌గా ఉన్నారు.