రాజకీయాలతో బిజీబిజీగా ఉండే మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ మానవత్వాన్ని చాటుకుని ఆదర్శంగా నిలిచారు. అనిల్ దేశ్ ముఖ్, ఆయన భార్య ఆదివారం నాగ్‌పూర్‌లో ‘కన్యాడాన్’ కార్యక్రమం నిర్వహించారు. అనాథ బాలికను చేరదీసి శాస్త్రోత్తంగా పెళ్లి జరిపించారు. నాగ్‌పూర్ కలెక్టర్ రవీంద్ర ఠాక్రేతో కలిసి హోంమంత్రి భార్య వరుడి కోసం తండ్రి విధిని నిర్వర్తించారు.
ఈ దంపతులు నాగ్‌పూర్‌లోని శ్రద్ధావాన్ లాన్‌లో జరిగిన వివాహ మహోత్సవంలో కన్యాదానం చేశారు. అనిల్ దేశ్‌ముఖ్ అతని భార్య వర్ష్ దేశ్‌ముఖ్‌లు వినికిడి లోపం ఉన్న అనాథ యువతికి వధువు తరపున, అదేవిధంగా నాగపూర్ కలెక్టర్ రవీంద్ర ఠాక్రే, అతని భార్య జ్యోత్స్నఠాక్రే వరుని తరపున బాధ్యత వహిస్తూ ఈ వివాహం జరిపించారు. ఈ వివాహానికి ముందు జరిగే వేడుకలన్నీ అనిల్ దేశ్‌ముఖ్ ఇంటిలో జరిగాయి. అనిల్ దేశ్‌ముఖ్ కోడలు రిద్దీ దేశ్‌ముఖ్ వధువు వర్ష, వరుడు సమీర్ లను అభినందించారు. అలాగే, వధూవరులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం శ్రద్ధావాన్ లాన్‌లో వర్షను పెళ్లికూతురు చేసే కార్యక్రమం జరిగింది. కాగా వర్ష మాదిరిగానే సమీర్ కూడా బదిరుడే విశేషం.
చెవిటి మూగవాడైన సమీర్ డోంబివాలీలో శంకర్ బాబా అనే వ్యక్తికి కనిపించాడు. దీంతో ఆయన సమీర్ కు చదువు చెప్పి, అతని సంరక్షణ బాధ్యతలు చూశారు. ఈ వివాహం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. కాగా వర్ష 23 ఏళ్ల క్రితం నాగపూర్ రైల్వే స్టేషన్‌లో అనాథగా కనిపించింది. ఆ చిన్నారి కొంతకాలం అంబాదాస్ పంత్ అనాథశరణాలయంలో ఉంది. తరువాత ఆ చిన్నారిని శంకర్‌బాబా పెంచి పోషించారు.