మధ్య ప్రదేశ్ మంత్రివర్గ విస్తరణలో పంతం నెగ్గించుకున్న జ్యోతిరాదిత్య సింధియా.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు చోటు
సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ మంత్రివర్గ విస్తరణలో జ్యోతిరాదిత్య సింధియాకు విధేయులైన ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం లభించింది.
MP Ccabinet Expansion: మధ్యప్రదేశ్ మంత్రి పదవుల పందారంలో బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా పంతం నెగ్గించుకున్నారు. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఆదివారం చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో జ్యోతిరాదిత్య సింధియాకు విధేయులైన ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం లభించింది. ఇటీవల నవంబర్‌లో నిర్వహించిన ఉప ఎన్నికల్లో తులసీరాం సిలావత్, గోవింద్ రాజ్‌పూత్‌లు ఘన విజయం సాధించడంతో వారికి అమాత్య పదవి కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్న సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. అదివారం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందిబెన్ పటేల్ సమక్షంలో ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిద్దరి చేరికతో చౌహాన్ నేతృత్వంలోని మంత్రి మండలి సభ్యుల సంఖ్య 31కి చేరింది. చౌహాన్ మంత్రివర్గంలో ఇప్పటివరకు మొత్తం సింధియా వర్గీయులు 12 మంది మంత్రి పదవులు పొందారు.
ప్రస్తుతం మంత్రివర్గంలోకి వచ్చిన సిలావత్, రాజ్‌పూత్‌లు ఇద్దరూ గతేడాది మార్చిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. వీరితో పాటు మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలూ ఆ పార్టీకి రాజీనామా చేసి సింధియా నాయకత్వంలో కాషాయం కండువా కప్పుకున్నారు. దీంతో కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. కాగా, నవంబర్‌లో 28 స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించగా.. బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు 19 స్థానాల్లో గెలిచి అధికారాన్ని నిలబెట్టుకుంది. కాంగ్రెస్ 9 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.