కబాలికో క్యా హువా..! ‘అన్నాతై’ బృందంలో కరోనా దడ.. షూటింగ్ స్టాప్, జనవరి 17న పార్టీ ఆవిర్భావ సభ జరిగేనా?

|

Dec 26, 2020 | 12:07 PM

కబాలీకేమైంది.! తమిళనాట ఫ్యాన్స్‌ సహా అంతటా ఇదే మాట వినిపిస్తోంది. అస్వస్థతకు గురైయితే కొత్తగా పెట్టే పార్టీ పరిస్థితి..

కబాలికో క్యా హువా..! అన్నాతై బృందంలో కరోనా దడ.. షూటింగ్ స్టాప్, జనవరి 17న పార్టీ ఆవిర్భావ సభ జరిగేనా?
Follow us on

Rajinikanth health: కబాలీకేమైంది.! తమిళనాట ఫ్యాన్స్‌ సహా అంతటా ఇదే మాట వినిపిస్తోంది. అస్వస్థతకు గురైయితే కొత్తగా పెట్టే పార్టీ పరిస్థితి ఏంటని…?,  కాలా పొలిటికల్ ఎంట్రీతో మంచి జోష్‌ మీదున్న ఫ్యాన్స్‌ ఒక్కసారిగా కలత చెందుతున్నారు. ఉన్నఫళంగా తమిళనాట రజనీకాంత్ పార్టీకి సంబంధించిన ఏర్పాట్లు ఆగిపోయాయ్‌. బాబా కోసం రాష్ట్రవ్యాప్తంగా పూజలు చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఇష్టదైవాన్ని కోరుకుంటున్నారు. అసలు, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కు ఏమైంది? సడెన్‌గా ఆయన హై బీపీతో ఆసుపత్రిలో ఎందుకు చేరారు? ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఫ్యాన్స్‌లో ఇప్పుడు ఇదే టెన్షన్‌. అయితే అపోలా ఆసుపత్రి వర్గాలు మాత్రం తలైవా ఆరోగ్యం నిలకడగానే ఉందని హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ఇవాళ సాయంత్రం డిశ్చార్జిపై ఓ డెసిషన్‌ తీసుకునే అవకాశం ఉంది. కాగా, కొత్తపార్టీ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కమిటీలు, బూత్‌ కమిటీల జాబితాపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. అయితే రజినీకాంత్ ఆమోదం లభించాల్సి ఉంది.

‘అన్నాతై’ మూవీ షూటింగ్‌ తర్వాత కబాలి ఊ..అంటే అన్ని ఏర్పాట్లు చకచకా జరిగేపోయేలా ఏర్పాటు చేశారు. అయితే రజినీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడంతో ..జనవరి 17న పార్టీ ఆవిర్భావ సభ కూడా వాయిదా పడే అవకాశం ఉంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాతే అన్ని వివరాలు ప్రకటిస్తామని పార్టీ కన్వీనర్లు చెబుతున్నారు. తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ నటిస్తున్న ‘అన్నాతై’ సినిమా షూటింగ్‌లో కరోనా దడ పుట్టించింది. హైదరాబాద్‌ రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. యూనిట్‌లో 8 మంది సభ్యులకు కరోనా సోకినట్టు నిర్ధారించారు. అయితే కరోనా టెస్ట్‌ల్లో రజినీకాంత్‌కు నెగెటివ్‌ రావడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. పలువురికి కరోనా సోకడంతో షూటింగ్‌ను వాయిదా వేస్తునట్టు ‘అన్నాత్తై’ సినిమాను నిర్మిస్తున్న సన్‌నెట్‌వర్క్‌ ప్రకటించింది. రజనీకాంత్‌ ప్రస్తుతం హైబీపీతో అపోలా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో…త్వరలో డిశ్చార్జి అయ్యే అవకాశం ఉంది. షూటింగ్ సమయంలో, రజినీకాంత్‌ కోసం స్టూడియోలో స్పెషల్‌ బయోబబుల్‌ వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. కబాలి వయస్సు దృష్ట్యా స్టూడియోలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే షూటింగ్‌ సందర్భంగా ఆయన్ని కలవడానికి ఎవరిని అనుమతింలేదు. వాస్తవానికి డిసెంబర్‌ 31 నాటికి సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలన్న ఆలోచనలో రజినీకాంత్‌ ఉన్నారు. జనవరి 17న ఎంజీఆర్‌ జయంతి నాడు రజినీకాంత్‌ కొత్త పార్టీని ప్రకటించడం, ఫిబ్రవరి నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేలా ప్లాన్ చేసుకున్నారు. పొలిటికల్‌ ఎంట్రీ కంటే ముందే ‘అన్నాత్తై’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలన్న ఆలోచన రజినీకాంత్‌కు ఉంది. రజనీ అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరుగుతాయేమో చూడాలి.