ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీఏదే గెలుపని వచ్చిన ఫలితాలను గురువారం నాటి రిజల్ట్స్ కచ్చితంగా నిరూపించాయి. దేశ వ్యాప్తంగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం కొనసాగింది. అనుకున్నట్లు గానే.. కాంగ్రెస్ రెండో స్థానంలో.. మిగతా పార్టీలు మూడో స్థానానికి దిగజారాయి.
అయితే బీజేపీకి అక్కడక్కడ గట్టి పోటీ కూడా తగిలింది. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, తమిళనాడులో డీఎంకే వంటి ప్రాంతీయ పార్టీలు కమలం పార్టీని గట్టిగా ఎదుర్కొన్నాయి. గురువారం ఉదయం 10.00 గంటల వరకు వెళ్లడైన ఫలితాల్లో ఎన్డీఏ 326 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 106, ఇతరులు 92 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నారు.
వారణాసి నుంచి పోటీ చేసిన ప్రధాని మోదీ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌పై సుమారు 20,000ఓట్ల భారీ ఆధక్యం దిశగా కొనసాగుతున్నారు. ఇక్కడ ఎస్పీ అభ్యర్ధి శాలినీ యాదవ్ మూడో స్థానంలో ఉన్నారు. గుజరాత్ గాంధీ నగర్‌లో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా 50,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ యూపీలోని అమేథీ నియోజకవర్గంలో వెనుకంజలో ఉండగా.. ఆయనపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ పై చేయిలో ఉన్నారు. అయితే కేరళలోని వయనాడ్ లో రాహుల్ తన సమీప సీపీఐ అభ్యర్ధిపై ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఇక యూపీ, కర్ణాటక, గుజరాత్, బీహార్, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా.. ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే, ఒడిషాలో బీజేడీ, వెస్ట్ బెంగాల్‌లో టీఎంసీ అధిక్యంలో కొనసాగుతున్నాయి.