భారత్ లో కోవిద్ 19 విజృంభణతో వాణిజ్య, ఉత్పాదక కార్యకలాపాలు స్తంభించాయి. పలు కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని కోరుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచించింది. ఈ నియంత్రణలను పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించినట్లు కేంద్ర సమాచార శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధానమంత్రి ఏం చెబుతున్నారో వినాలని, లాక్‌డౌన్‌ను సీరియస్‌గా తీసుకోవాలని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ట్విటర్‌లో విజ్ఞప్తి చేసింది.
భారత్ లో కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. దేశవ్యాప్తంగా 425 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ కొంతమంది లాక్‌డౌన్‌ను తీవ్రంగా పరిగణించట్లేదని, ‘దయచేసి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.. మీ కుటుంబ సభ్యులను కాపాడండి’ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. నియంత్రణలను కట్టుదిట్టంగా పాటించాలని ప్రజలకు పిలుపునిస్తూ.. ప్రజలంతా ఈ నియమాలను, చట్టాన్ని పాటించేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.