బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇంటిని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కూల్చివేయడం చట్ట విరుధ్దమంటూ బాంబేహైకోర్టు ఇచ్చిన రూలింగ్ పై స్పందించిన శివసేన నేత సంజయ్ రౌత్.. చట్టమన్నది అందరికీ సమానంగా ఉండాలన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అన్ని అంశాలూ పరిశీలించాకే ఆమె ఇంటిలో కొంత భాగాన్ని కూల్చివేశారని, అలాంటప్పుడు అది చట్ట వ్యతిరేకమెలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. కోర్టు నిర్ణయాన్ని తాను ఇంకా గౌరవిస్తున్నానని, లా అన్నది ప్రతివ్యక్తికి సమానంగా ఉండాలని వ్యాఖ్యానించారు. ముంబైని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ గా అభివర్ణిస్తూ కంగనా లోగడ చేసిన ట్వీట్ వివాదం రేపింది. గత సెప్టెంబరు 9 న పాలీ హిల్ లోని ఆమె ఇంటిలో కొంతభాగాన్ని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కూల్చివేయగా దాన్ని సవాలు చేస్తూ ఆమె కోర్టుకెక్కింది. ఈ విషయంలో ఆమెకు అనుకూలంగా కోర్టు ఉత్తర్వులిచ్చినప్పటికీ సంయమనంతో వ్యవహరించాలని ఆమెకు సూచించింది. ప్రభుత్వం పట్ల నిగ్రహంగా వ్యవహరించాలని కోరింది.
అయితే అదే సమయంలో సంజయ్ రౌత్ ని కూడా కోర్టు మందలించింది. ఒక పార్లమెంటేరియన్ గా మీ ప్రవర్తన ఆ పదవికి తగినట్టు లేదని పేర్కొంది. కంగనా పట్ల మీరు చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయని భావిస్తున్నట్టు పేర్కొంది. అయితే ముఖ్యమంత్రి ఉధ్దవ్ థాక్రే పట్ల కంగనా చేసిన కామెంట్స్ అంశాన్ని కోర్టు పరిగణన లోకి తీసుకోనట్టు కనబడుతోంది. సీఎం ను ఆమె ..నువ్వు (తుమ్) అంటూ సంబోధించిన విషయం గమనార్హం. అలాగే బాలీవుడ్ ని… డ్రగ్స్ మాఫియాతో కూడినదిగా కూడా ఆమె దుయ్యబట్టింది. దీనిపై బాలీవుడ్ ఆర్టిస్ట్ ఒకరు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఆమెకు, ఆమె సోదరికి కూడా సమన్లు జారీ చేశారు.