సంచలన సృష్టించిన అటవీ మహిళా అధికారి అనితపై దాడి ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ తన పదవికి రాజీనామా చేశారు. కాగజ్ నగర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చోలే అనితపై కొంతమంది స్ధానికులు కర్రలతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. హరితహారంలో భాగంగా కాగజ్‌నగర్ మండలం సార్సాల గ్రామంలో మొక్కలు నాటేందుకు భూమిని చదును చేస్తోన్న అటవీ అధికారులపై ఆదివారం ఈ దాడి జరిగింది.
ఈ ఘటనపై గాయపడ్డ అధికారి అనిత కోనేరు కృష్ణపై ఆరోపణలు చేశారు. ఆయనే గ్రామస్తులను రెచ్చగొట్టి దాడి చేయించారన్నారు. ఆమె ఫిర్యాదుతో పోలీస్ కేసు కూడా నమోదైంది. అయితే కృష్ణ మాత్రం తాను దాడికి పాల్పడలేదని వాదిస్తూ వచ్చారు. కానీ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఆయన స్పష్టంగా కనిపించారు.
అయితే విత్తనాలు నాటిన పంట భూములను ట్రాక్టర్లతో దున్నేస్తుంటే తట్టుకోలేని గ్రామస్థులు ఫారెస్ట్ అధికారులపై దాడికి పాల్పడ్డారని కృష్ణ తెలిపారు. ఈనేపధ్యంలో అటవీ అధికారిణి అనితపై దాడి చేసినట్టు తనపై వచ్చిన ఆరోపణలు నేపథ్యంలో జెడ్పీ వైస్ చైర్మన్ పదవికి కోనేరు కృష్ణ రాజీనామా చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు తన రాజీనామా లేఖను పంపారు. జెడ్పీ ఛైర్మన్ పదవితో పాటు జెడ్‌పీటీసీ పదవులకు తాను రాజీనామా చేస్తున్నట్లు లేఖలో కోనేరు కృష్ణ పేర్కొన్నారు.