AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

30 ఏళ్లుగా అన్నం ముట్టని కాజమ్మ.. రోజుకు 20 టీలు, వేరుశనగలే ఆహారం!

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైదాపూర్ గ్రామానికి చెందిన కాజమ్మ గత 30 ఏళ్లుగా అన్నం ముట్టుకోవడం లేదు. కుటుంబ సభ్యులు అన్నం తినడం దండగ అని చెప్పిన మాటను మనసులో పెట్టుకున్న ఆమె అప్పటి నుంచి అన్నానికి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం రోజుకు దాదాపు 20 టీలు తాగుతూ, రెండు మూడు సార్లు వేరుశనగలు తింటున్నారు. అన్నం తినాలని తనకు ఇప్పుడు ఎలాంటి కోరిక కూడా లేదని కాజమ్మ చెబుతున్నారు.

30 ఏళ్లుగా అన్నం ముట్టని కాజమ్మ.. రోజుకు 20 టీలు, వేరుశనగలే ఆహారం!
Kajamma
G Sampath Kumar
| Edited By: |

Updated on: Sep 01, 2026 | 3:20 PM

Share

ఇరుగుపొరుగు వారు పొద్దున కలిస్తే.. టిఫిన్ చేశారా? అని, మధ్యాహ్నం కలిస్తే.. భోజనం చేశారా? అని అడగడం మన దగ్గర పరిపాటి. కానీ జగిత్యాల జిల్లాలోని ఓ గ్రామంలో మాత్రం ఓ మహిళను అన్నం తిన్నారా? అని అడిగేవారే ఉండరు. కారణం.. ఆమె గత 30 ఏళ్లుగా అన్నం ముట్టుకోలేదు. అంతేకాదు.. రోజుకు దాదాపు 20 టీలు తాగుతూ, వేరుశనగలతోనే జీవిస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైదాపూర్ గ్రామానికి చెందిన కాజమ్మ అనే మహిళ ఆహారపు అలవాట్లు ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఆమెకు ప్రధాన ఆహారం వేరుశనగలు కాగా.. టీ మాత్రం రోజులో దాదాపు 20 సార్లు తాగుతారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

చిన్న మనస్పర్థతో మొదలై..

సుమారు 30 ఏళ్ల క్రితం భర్తతో చిన్నపాటి మనస్పర్థలు రావడంతో కాజమ్మ పుట్టింటికి వచ్చింది. ఆ తర్వాత తిరిగి అత్తారింటికి వెళ్లకుండా పుట్టింట్లోనే ఉండిపోయింది. ఆ సమయంలో కుటుంబ సభ్యుల్లో కొందరు.. ‘నువ్వు అన్నం తినడం దండగ’ అంటూ తిట్టిపోశారట. ఆ మాటలను కాజమ్మ చాలా సీరియస్‌గా తీసుకుంది. అప్పటి నుంచి అన్నం తినడం పూర్తిగా మానేసింది. ఆవిడ కుటుంబ సభ్యులపై అలిగిందో.. అన్నం మీద అలిగిందో తెలియదు కానీ, ఆ ఒక్క మాటకు కట్టుబడి మూడు దశాబ్దాలుగా అన్నం ముట్టుకోలేదు.

ఎంత చెప్పినా.. అన్నం ముట్టుకోదు

కాజమ్మను అన్నం తినిపించేందుకు కుటుంబ సభ్యులు ఎన్నోసార్లు ప్రయత్నించారు. ఎంత ఒత్తిడి చేసినా ఆమె మాత్రం అన్నం తినేందుకు అంగీకరించలేదు. బంధువుల ఇళ్లకు వెళ్లినా టీ తప్ప మరే ఆహారాన్ని తీసుకోరని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమె కోసం ఇంట్లోవారు కూడా తరచూ టీ తయారు చేసి ఇస్తుంటారు. ప్రస్తుతం కాజమ్మ రోజుకు రెండు, మూడు సార్లు వేరుశనగలు తింటూ.. మిగిలిన సమయంలో టీ తాగుతూ ఉంటారని చెబుతున్నారు. అన్నం సహా ఇతర ఆహార పదార్థాలను కూడా పెద్దగా తీసుకోరని కుటుంబ సభ్యులు అంటున్నారు.

అన్నం తినాలనే కోరిక కూడా లేదట!

30 ఏళ్లుగా అన్నం తినకపోయినా ఇప్పటివరకు తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని కాజమ్మ చెబుతున్నారు. ప్రస్తుతం తనకు అన్నం మీద ఆసక్తి తగ్గిపోయిందని.. తినాలనే కోరిక కూడా కలగడం లేదని అంటున్నారు. అన్నం దండగ అన్న ఒక్క మాట కారణంగా మూడు దశాబ్దాలుగా అన్నం ముట్టుకోకుండా ఉండటం అరుదైన విషయమే. రోజుకు 20 టీలు, వేరుశనగలతోనే కాలం గడుపుతున్న కాజమ్మ ఆహారపు అలవాట్లు ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.

Follow Us