AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటి ముందుకే APSRTC బస్సు.. విజయవాడ ప్రయాణికులకు గుడ్ న్యూస్!

విజయవాడ ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆరుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది బృందంగా ప్రయాణిస్తే.. బస్టాండ్‌కు వెళ్లే అవసరం లేకుండా ఇంటి వద్దకే బస్సును పంపే హోమ్ పికప్ సేవను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ప్రస్తుతం విజయవాడ-హైదరాబాద్ మార్గంలో ఈ సదుపాయం అందుబాటులో ఉంది.

ఇంటి ముందుకే APSRTC బస్సు.. విజయవాడ ప్రయాణికులకు గుడ్ న్యూస్!
APSRTC Bus
Ram Naramaneni
|

Updated on: Sep 01, 2026 | 3:57 PM

Share

విజయవాడ ప్రజలకు ఏపీఎస్ఆర్టీసీ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్‌తో కలిసి దూరప్రాంతాలకు వెళ్లాలంటే భారీ లగేజీతో ఆటోలు, క్యాబ్‌లు ఎక్కి బస్టాండ్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. టికెట్ బుక్ చేసుకుంటే చాలు.. అవసరమైన ప్రయాణికుల బృందం కోసం ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఏకంగా ఇంటి ముందుకే వచ్చే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ వినూత్న ప్రయోగాన్ని విజయవాడ నుంచే ప్రారంభించింది.

ఆరుగురు ఉంటే చాలు..

టికెట్ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుల ఇళ్ల వద్దకే బస్సును పంపే ఈ సౌకర్యాన్ని ప్రస్తుతం విజయవాడ నగరంలోని ప్రయాణికులకు మాత్రమే అందిస్తున్నారు. విజయవాడ-హైదరాబాద్ మార్గంలో ప్రయోగాత్మకంగా ఈ సేవను నిర్వహిస్తున్నారు. ఆరుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఒక బృందంగా ప్రయాణించాలనుకుంటే ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ప్రయాణికులు ఇంటర్నెట్ ద్వారా లేదా ఆర్టీసీ కౌంటర్లలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నవారితో పాటు, టికెట్లు బుక్ చేసుకోవాలనుకునే ప్రయాణికుల బృందాలు కూడా ఈ సేవ కోసం సంప్రదించవచ్చు.

దూరాన్ని బట్టి ఛార్జీ

ఈ హోమ్ పికప్ సదుపాయాన్ని వినియోగించుకునే ప్రయాణికులు అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణికులు బస్సు ఎక్కే ప్రదేశానికి, సంబంధిత బస్ స్టాండ్‌కు మధ్య ఉన్న దూరాన్ని బట్టి రుసుమును నిర్ణయిస్తారు. దీంతో కుటుంబాలు, స్నేహితుల బృందాలు లగేజీతో బస్టాండ్‌కు వెళ్లే ఇబ్బందులు తప్పనున్నాయి.

నాలుగు గంటల ముందే సమాచారం ఇవ్వాలి

హోమ్ పికప్ సదుపాయం కావాలనుకునే ప్రయాణికులు బస్సు బయలుదేరే సమయానికి కనీసం నాలుగు గంటల ముందుగా ఆర్టీసీ అధికారులను సంప్రదించాలి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఈ సేవ కోసం 73828 25450, 99592 25450 నంబర్లకు ఫోన్ చేయవచ్చు.

ప్రస్తుతం విజయవాడ-హైదరాబాద్ మార్గంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ సేవకు ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను బట్టి భవిష్యత్తులో మరిన్ని మార్గాలకు విస్తరించే అవకాశం ఉంది. మొత్తానికి ఒకే ప్రాంతానికి చెందిన ఆరుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి ప్రయాణించే వారికి ఈ హోమ్ పికప్ సదుపాయం ఎంతో ఉపయోగకరంగా మారనుంది.

Follow Us