అన్నం బదులు ఈ రొట్టె తినండి.. ఉక్కులాంటి శరీరం.. రోగాల ముచ్చటే ఉండదు..
జొన్న రొట్టె కేవలం సంప్రదాయ ఆహారం మాత్రమే కాదు.. ఆరోగ్యానికి మేలు చేసే పోషకాల నిధి. ఫైబర్, ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉండే జొన్న రొట్టె బరువు నియంత్రణ, మధుమేహం అదుపు, జీర్ణవ్యవస్థ ఆరోగ్యం, గుండె సంరక్షణ, ఎముకల దృఢత్వానికి తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజువారీ ఆహారంలో జొన్న రొట్టెను చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవచ్చని సూచిస్తున్నారు.

ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. అందుకే.. ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో ప్రజలు తమ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. ఇందులో భాగంగా పాతకాలపు ఆహారపు అలవాట్లకు, ముఖ్యంగా చిరుధాన్యాలకు (మిల్లెట్స్) తిరిగి ప్రాధాన్యత ఇస్తున్నారు. వాటిలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆహార పదార్థం జొన్న రొట్టె. జొన్నల్లో ఉండే విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.. అంతేకాకుండా.. శరీరాన్ని ఉక్కుల మార్చి.. రోగాల బారిన పడకుండా కాపాడతాయి. జొన్నల్లో ఫైబర్, ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. గ్లూటెన్ (Gluten) లేని ఆహారం కాబట్టి, సులభంగా జీర్ణమవుతాయి. మధుమేహం ఉన్నవారికి, బరువు తగ్గాలనుకునేవారికి జొన్న రొట్టె ఒక ఉత్తమమైన ఆహారమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా జొన్న రొట్టెలు (Jowar Roti) మొత్తం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని డైటీషియన్లు చెబుతున్నారు.
తక్షణ శక్తి – ఉత్సాహం:
జొన్న రొట్టెల్లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు విరివిగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన తక్షణ శక్తిని (Instant Energy) అందిస్తాయి. రోజువారీ ఆహారంలో జొన్న రొట్టెను చేర్చుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండటమే కాకుండా శారీరక అలసట తగ్గకుండా ఉంటుంది.
జీర్ణవ్యవస్థ ఆరోగ్యం – మలబద్ధకం నివారణ:
జొన్నల్లో ఫైబర్ (పీచు పదార్థం) చాలా అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేసి, జీర్ణ వ్యవస్థను క్రమబద్ధంగా పనిచేసేలా చేస్తుంది. క్రమం తప్పకుండా జొన్న రొట్టెలు తినడం వల్ల మలబద్ధకం సమస్య దూరమై, పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
బరువు నియంత్రణ (Weight Loss):
బరువు తగ్గాలనుకునే వారికి జొన్న రొట్టె ఒక అద్భుతమైన ఆహారం. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావన (Satiety) కలుగుతుంది. ఇది త్వరగా ఆకలి వేయకుండా చూస్తుంది, దాంతో శరీరంలోకి అధిక క్యాలరీలు చేరకుండా బరువును సులభంగా నియంత్రించవచ్చు.
మధుమేహం (షుగర్) నియంత్రణ:
జొన్నల్లో గ్లైసీమిక్ ఇండెక్స్ (GI) చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల జొన్న రొట్టె తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు ఒకేసారి పెరగకుండా క్రమబద్ధంగా ఉంటాయి. డయాబెటిస్ (మధుమేహం) ఉన్నవారు రోజూ జొన్న రొట్టెను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.
గుండె ఆరోగ్యం – కొలెస్ట్రాల్ తగ్గింపు:
జొన్న రొట్టెల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని హానికర విష పదార్థాలను (ట్యాక్సిన్స్) తొలగించడమే కాకుండా, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది గుండె సంబంధిత సమస్యలను నివారించి, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
ఎముకల దృఢత్వం:
జొన్నల్లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ B వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా కాల్షియం, మెగ్నీషియం ఎముకల సాంద్రతను పెంచి, వాటిని దృఢంగా మారుస్తాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకల బలహీనతను నివారించడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
జొన్న రొట్టెలు కేవలం ఒక సంప్రదాయ ఆహారం మాత్రమే కాకుండా, అనేక అనారోగ్య సమస్యలను నివారించే ఒక పోషకాహార నిధి.. ప్రతిరోజూ మన ఆహారంలో జొన్న రొట్టెను భాగం చేసుకోవడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొంది, ఆరోగ్యకరమైన జీవనశైలిని గడపవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
