పౌరసత్వ చట్టంపై ఆరని నిరసన సెగలు.. ‘ గర్జించిన ‘ విద్యార్ధి లోకం
పొరసత్వ చట్టంపై దక్షిణ ఢిల్లీలో జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులు ప్రారంభించిన ఆందోళన దేశ వ్యాప్తమైంది. వీరికి అలీగఢ్ యూనివర్సిటీ విద్యార్థులు కూడా తోడయ్యారు. పౌరసత్వ బిల్లును సవరించి చట్టంగా మార్చిన తీరుకు, తమపై పోలీసుల దమనకాండకు నిరసనగా సోమవారం ఉదయం వణికిస్తున్న చలిలోనే విద్యార్థులు అర్ధ నగ్న ప్రదర్శన చేశారు. జామియా క్యాంపస్ లోకి చొచ్ఛుకువెళ్లిన పోలీసులు వందలాది విద్యార్థులను అరెస్టు చేశారు. తమను ఖాకీలు దుర్భాషలాడుతున్నారని, లాఠీలతో కుళ్ళబొడుస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అట్టుడుకుతున్న అల్లర్ల […]
పొరసత్వ చట్టంపై దక్షిణ ఢిల్లీలో జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులు ప్రారంభించిన ఆందోళన దేశ వ్యాప్తమైంది. వీరికి అలీగఢ్ యూనివర్సిటీ విద్యార్థులు కూడా తోడయ్యారు. పౌరసత్వ బిల్లును సవరించి చట్టంగా మార్చిన తీరుకు, తమపై పోలీసుల దమనకాండకు నిరసనగా సోమవారం ఉదయం వణికిస్తున్న చలిలోనే విద్యార్థులు అర్ధ నగ్న ప్రదర్శన చేశారు. జామియా క్యాంపస్ లోకి చొచ్ఛుకువెళ్లిన పోలీసులు వందలాది విద్యార్థులను అరెస్టు చేశారు. తమను ఖాకీలు దుర్భాషలాడుతున్నారని, లాఠీలతో కుళ్ళబొడుస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అట్టుడుకుతున్న అల్లర్ల నేపథ్యంలో అనేకమంది స్టూడెంట్స్ తమ హాస్టళ్లు ఖాళీ చేసి సొంత ప్రాంతాలకు బయలుదేరుతున్నారు. ఢిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద చాలామంది ఆదివారం అర్ధ రాత్రి కూడా ఆందోళన కొనసాగించారు.
ఇలా ఉండగా విద్యార్థుల ఆందోళన మెల్లగా దేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. ఐఐటీ ముంబై, ఐఐటీ మద్రాసుతో బాటు అనేక యూనివర్సిటీలు , కళాశాలలకు నిరసన సెగలు తాకాయి. ముంబైలోని టాటా ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ విద్యార్థులు.. జామియా, అలీగఢ్ వర్సిటీల స్టూ డెంట్స్‌కు సంఘీభావంగా సోమవారం తరగతులు బాయ్‌కాట్ చేశారు. ముంబై యూనివర్సిటీ, బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ సైన్స్, యూపీలోని బనారస్ యూనివర్సిటీ, చండీగఢ్ యూనివర్సిటీల విద్యార్థులు సైతం ఆందోళనలకు సిధ్ధపడుతున్నారు. హైదరాబాద్ లోని మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ స్టూడెంట్స్‌తో బాటు కోల్‌కతాలోని జాదవ్ పూర్ విశ్వవిద్యాలయం విద్యార్థులు అర్దరాత్రి ప్రదర్శన చేశారు. తమ పరీక్షలను వాయిదా వేయాలని మౌలానా ఆజాద్ విశ్వవిద్యాలయం విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అటు.. అస్సాంలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. ఆదివారం కొన్ని గంటలపాటు గౌహతిలో కర్ఫ్యూను సడలించినప్పటికీ పోలీసులకు, విద్యార్థులకు మధ్య మళ్ళీ ఘర్షణలు చెలరేగే అవకాశం ఉందని భావిస్తున్నారు.