న్యూఢిల్లీ : భారత్ పై దాడులు జరిపేందుకు జైషే మహ్మద్, తాలిబన్ ఉగ్రవాద సంస్థలు సంయుక్తంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయాన్ని భారతీయ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు వెల్లడించాయి. పాక్‌కు చెందిన గూఢాచార ఏజెన్సీ ఐఎస్ఐ .. ఈ కుట్రకు ప్రాణం పోసినట్లు అనుమానిస్తున్నారు. జైషే, తాలిబన్లను ఒక్క గ్రూపుగా మార్చేందుకు పాక్ ఐఎస్ఐ ప్లాన్ వేసినట్లు తెలిసింది. బాలాకోట్‌లో భారత వైమానిక దళం దాడులు చేయకముందే ఈ ప్రణాళిక రచన జరిగినట్లు చెబుతున్నారు. జైషే, తాలిబన్, హక్కానీ గ్రూపులు జిహాదీ దాడులకు అంగీకరించినట్లు ఇంటెలిజెన్స్ పేర్కొన్నది. ఈ మూడు ఉగ్ర సంస్థలు భారత్‌తో పాటు ఆఫ్ఘనిస్తాన్‌లో దాడులకు ప్లాన్ వేశాయని.. అంతే కాకుండా పాకిస్థాన్‌లో గతేడాది డిసెంబర్ 15 నుంచి 20 మధ్య ఈ మీటింగ్ జరిగినట్లు అనుమానిస్తున్నారు. తాలిబన్లతో చర్చలు జరిపేందుకు అమెరికా నిర్ణయించిన తర్వాత.. పాక్‌కు చెందిన ఐఎస్ఐ ఈ మూడు ఉగ్ర సంస్థలను ఒక్కటి చేసేందుకు ప్రయత్నిస్తున్నది. పీవోకేలో మొత్తం 16 టెర్రర్ గ్రూపులు పనిచేస్తున్నాయని, వాటిల్లో గత ఏడాది 560 మంది ట్రైనింగ్ తీసుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. దీంతో భారత భద్రతా దళాలు సరిహద్దుల వెంట పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.