కాంగ్రెస్ పార్టీకి చెందిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన కామెంట్లు చేశారు. హైదరాబాద్ పట్టపగలు తన కార్యలయంలో సజీవ దహనమైన తహసీల్దారు విజయారెడ్డి ఉదంతంపై సెన్సేషనల్ కామెంట్లు చేశారు. ఈ ఉదంతానికి రెవెన్యూ వ్యవస్థలోని అవినీతి కారణమని అంటూనే ఇందుకు కారకలు వీరూ అంటూ హాట్ కామెంట్ చేశారాయన.
హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దారు కార్యాలయంలో పట్టపగలు విజయారెడ్డిపై సురేశ్ అనే రైతు పెట్రోల్ పోసి తగులబెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతానికి కారణం ఓ పత్రిక, ఓ మంత్రితోపాటు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులేనంటూ జగ్గారెడ్డి ఓ వీడియో రికార్డు చేసి మరీ మీడియాకు విడుదల చేశారు.
గతంలో తెలంగాణ రెవెన్యూ చట్టం , రైతులకు ,అధికారులకు వెసులుబాటుగా ఉండేదని ఆయనంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ రెవెన్యూ చట్టం మార్పులు రైతులకు ,అధికారులకు ఇబ్బందిగా మారాయని జగ్గారెడ్డి ఆరోపిస్తున్నారు. ఒక పత్రికలో ధర్మగంట పేరుతో నిర్వహిస్తున్న శీర్షిక రైతులు,అధికారులకు మధ్య వైరాన్ని పెంచిందని, రెవెన్యూ అధికారులపై ధర్మ గంట ప్రజల్లో విషయాన్ని నూరిపోసిందని ఫలితంగానే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయన్నది జగ్గారెడ్డి అభిప్రాయం. సీఎం రెవెన్యూ డిపార్ట్ మెంట్‌పై వ్యవహరించిన తీరే ఎమ్మార్వో అధికారి బలికి కారణమైందని అన్నారు.
అవినీతి నిర్మూలన అసాధ్యం
ఇంకో అడుగు ముందుకేసిన జగ్గారెడ్డి అవినీతిని, లంచాలను అరికట్టడం ఏ నాయకునికీ సాధ్యం కాదని సెన్సేషనల్ కామెంట్ చేశారు జగ్గారెడ్డి. ఎమ్మార్వో మృతి ఘటనలో ఉద్యోగ సంఘాల నాయకులది కూడా తప్పేనని అంటున్నారు జగ్గారెడ్డి. కేసీఆర్ నిర్ణయాలపై ఉద్యోగ సంఘాల నేతలు గుడ్డిగా ప్రభుత్వాన్ని సమర్థిస్తూ వస్తున్నది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాజేందర్, రవీందర్ రెడ్డి, మమతలదే ఈ ఉదంతానికి బాధ్యత అని చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి. రైతు ఆవేశానికి ప్రభుత్వం విధానాలు, ఎమ్మార్వో చావుకు ఉద్యోగ సంఘాలే తీరే కారణమన్నది ఆయన వాదన. ప్రభుత్వం మేల్కొని తగిన చర్యలు తీసుకోకుంటే.. రాష్ట్రం అగ్నిగుండంగా మారడం ఖాయమని ఆయన హెచ్చరించారు.