ఏపీకి మూడు రాజధానులను ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని చూచాయగా ప్రకటించి పెద్ద రాజకీయ దుమారానికి తెరలేపిన ముఖ్యమంత్రి జగన్.. పక్కా వ్యూహంతో ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. అమరావతిని రాజధానిగా చేసే ముందు చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన నాటకీయ పరిణామాలను కూలంకషంగా స్టడీ చేసిన సీఎం జగన్.. ఎలాంటి లీగల్ సమస్యలు, రాజకీయ దుష్పరిణామాలు ఎదురు కాకుండా ఏపీ ప్రజలందరినీ మెప్పించే ప్రణాళిక రూపొందించినట్లు చెబుతున్నారు. దానికి అనుగుణంగానే జగన్ వేస్తున్న అడుగులు త్వరలోనే ఓ దారిలోకి వచ్చి.. మూడు రాజధానుల ఏర్పాటులో కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది.
2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిన ఏపీలో రాజధాని ఎక్కడ పెట్టాలనే విషయంపై పెద్ద చర్చనే నడిచింది. కర్నూలు అని కొందరు, దొనకొండ అని మరికొందరు.. విజయవాడ అని ఇంకొందరు.. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు కథనాలు అల్లుకున్నారు. ఏపీలో బిగ్గెస్ట్ సిటీ విశాఖపట్నాన్ని రాజధాని చేయాలని, చక్కని కనెక్టివిటీ వున్న విశాఖే బెటర్ రాజధాని అన్న వాదనలు కూడా వినిపించాయి. అయితే.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో వున్న అమరావతిని ఎంపిక చేసుకున్నారు. దానికి కారణం అమరావతి విజయవాడకు దగ్గరలో వుండడం ఒక కారణమైతే.. అమరావతికి వున్న చారిత్రక, పౌరాణిక ప్రాధాన్యం మరో కారణం.
భవ్యమైన రాజధాని కడతానంటూ అయిదేళ్ళు గడిపేసిన చంద్రబాబు మొన్నటి ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత పరిణామాలు మారిపోయాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించే విషయంలో సందేహాలకు బీజం వేశారు రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన వైసీపీ నేతలు. మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్లు పలుమార్లు పాలక, ప్రతిపక్షాల మధ్య మాటలయుద్దానికి తెరలేపిన పరిస్థితి చూశాం. అయితే, రాజధాని విషయంపై జరిగిన చర్చకు ముగింపు అన్నట్లుగా ముఖ్యమంత్రి జగన్ శాసనసభలో కుండబద్దలు కొట్టారు. మూడు రాజధానుల ప్రకటన తుగ్లక్ పరిపాలనను గుర్తు చేస్తుందని చంద్రబాబు విమర్శిస్తున్నప్పటికీ.. తన ప్రతిపాదనపై జగన్ లోతైన కసరత్తే చేస్తున్నట్లు చెబుతున్నారు.
తాను ముఖ్యమంత్రి అయ్యాక వేసిన రెండు కమిటీల రిపోర్టులు తీసుకున్న జగన్.. గతంలో రూపొందిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను కూడా నిర్లక్ష్యం చేయడం లేదు. తద్వారా భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ముఖ్యమంత్రి. బి.ఎన్.రావు కమిటీ ప్రస్తావించే అంశాలకు, గతంలో శివరామకృష్ణన్ కమిటీ వ్యక్తం చేసిన అభిప్రాయాలకు సమీప్యతను పరిశీలించేందుకు ఓ మెకానిజమ్‌ను సీఎం ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మెకానిజమ్ మూడు నివేదికలను పరిశీలించి, రూపొందించే నోట్స్ ఆధారంగానే డిసెంబర్ 27న జరిగే మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర రాజధాని విషయంలో నిర్ణయాలు తీసుకునేందుకు జగన్ సిద్దమవుతున్నారు. ఈలోగా రాష్ట్రంలో ఉత్పన్నమయ్యే పరిణామాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అధ్యయనం చేస్తున్నారు. వీటన్నింటి ఆధారంగానే జగన్ నిర్ణయం తీసుకుంటారని, ఆ తర్వాత ఎలాంటి కాంప్లికేషన్స్ వుండకుండా సీఎం జాగ్రత్తపడుతున్నారని తెలుస్తోంది.