కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పాలన్న జ్యోతిరాదిత్య సింధియా నిర్ణయాన్ని ఆయన అత్త, మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే యశోధరా రాజే సింధియా స్వాగతించారు. ‘దేశ ప్రయోజనాల దృష్ట్యా’ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని, ఇది ‘ఘర్ వాపసీ’ (సొంత గూటికి చేరడమే) అని ఆమె అభివర్ణించారు. తనతల్లి రాజమాత విజయరాజే సింధియా జనసంఘ్, బీజేపీ.. రెండింటినీ సమన్వయం చేయడంలో కీలకపాత్ర పోషించారని, తమ పార్టీకి అటు జ్యోతిరాదిత్య పట్ల, అతని తండ్రి దివంగత మాధవరావు సింధియా పట్ల ఎంతో గౌరవం ఉందని ఆమె చెప్పారు. జ్యోతిరాదిత్యను ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా స్వాగతించిన తీరు.. వారికి రాజమాత విజయరాజె సింధియా పట్ల ఉన్న గౌరవాన్ని సూచిస్తోందన్నారు. ‘చివరి వరకు వచ్ఛేసరికి ప్రతివారికీ సెల్ఫ్ రెస్పెక్ట్ (ఆత్మగౌరవం) అవసరం అవుతుంది అని యశోధర వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి విస్తృత సేవలందించి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశ్చర్యంగా గెలిచినప్పటికీ 2018 డిసెంబరులో జ్యోతిరాదిత్యకు సీఎం పదవిని ఇవ్వకపోవడంతోనే ఆయన పార్టీకి రాజీనామా చేశారని యశోధర పేర్కొన్నారు. ఒకప్పుడు మాధవరావు సింధియా గ్వాలియర్ నుంచి పోటీ చేసినప్పుడు ఆయనపై బీజేపీ తన అభ్యర్థిని నిలబెట్టలేదని ఆమె గుర్తు చేశారు. ఇది ఆయనపట్ల ఈ పార్టీకి ఉన్న గౌరవమేనన్నారు.