ఐసిస్ ఇక లేనట్టే.. మోతేరా స్టేడియంలో ట్రంప్

| Edited By: Anil kumar poka

Feb 24, 2020 | 2:59 PM

ప్రపంచంలో ఉగ్రవాద కార్య కలాపాలకు స్వస్తి పలికామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ఉగ్రవాద సంస్థ ఐసిస్ 'చచ్చిపోయింది' అని వ్యాఖ్యానించారు.

ఐసిస్ ఇక లేనట్టే.. మోతేరా స్టేడియంలో ట్రంప్
Follow us on

ప్రపంచంలో ఉగ్రవాద కార్య కలాపాలకు స్వస్తి పలికామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ఉగ్రవాద సంస్థ ఐసిస్ ‘చచ్చిపోయింది’ అని వ్యాఖ్యానించారు. టెర్రరిజం అన్నది గ్లోబల్ సమస్య అని, ఈ బెడదను తుదముట్టించేందుకు భారత, అమెరికా దేశాలు సంయుక్తంగా కృషి చేస్తున్నాయని ఆయన చెప్పారు. బాగ్దాద్, సిరియా వంటి దేశాల్లో ఈ ‘తీవ్రవాదం’ ఇంకా పెఛ్చరిల్లుతోందని, దీన్ని సమూలంగా నిర్మూలించేందుకు తాము పలు చర్యలు చేపట్టామని ఆయన అన్నారు. సోమవారం ప్రధాని మోడీతో కలిసి అహ్మదాబాద్ లోని అతి పెద్ద మోతేరా  స్టేడియంలో.. భారీ సంఖ్యలో హాజరైన ప్రజాసభలో  మాట్లాడిన ఆయన.. రక్షణ రంగంలో భారత, అమెరికా దేశాలు సహకరించుకుంటున్నాయని చెప్పారు. మోడీని ప్రశంసలతో ముంచెత్తుతూ, ఒక చాయ్ వాలాగా కెరీర్ మొదలు పెట్టి ప్రధాని స్థాయికి చేరుకున్నారు అన్నారు. తన చిరకాల మిత్రుడైన మోడీకి తన హృదయంలో ఎప్పుడూ సుస్థిర స్థానం ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. మోడీ నాయకత్వంలో భారత దేశం ఎంతో అభివృద్ది చెందిందని, ఉభయ దేశాల ప్రజల మధ్య స్నేహ, సౌభ్రాత్రాలు వెల్లివిరుస్తాయని అన్నారు. 60 కోట్లమంది ఓటర్లు మోడీకి తమ హృదయాల్లో చెరగని ముద్ర వేశారని ట్రంప్ వ్యాఖ్యానించారు.

అంతర్జాతీయ క్రికెటర్లలో మేటి ఆటగాళ్లయిన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ భారతీయులేనని, అలాంటి  గొప్ప క్రికెటర్లను ఈ దేశం అందించిందని ట్రంప్ చెప్పారు. ఈ దేశం ప్రజాస్వామ్య, శాంతియుత దేశం.. 1.20 లక్షల మందిని ఒకే చోట చూడడం ఆనందంగా ఉంది. అంటూ ఆయన ఈ సందర్భంగా స్వామి వివేకానందను గుర్తు చేశారు. కాగా- రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంటామని ఇది 3 బిలియన్ డాలర్ల వ్యయంతో కూడినదని తెలిపారు. ఈ భూమి మీదున్న అత్యాధునిక, భయం గొలిపే పరికరాలను భారత్ కు ఇవ్వడానికి సిధ్ధంగా ఉన్నాం.. గత ఏడాది టెక్సాస్ లోని పెద్ద ఫుట్ బాల్  స్టేడియంలో మీ ప్రధానికి మా దేశం స్వాగతం పలికింది.. ఈ రోజు ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంలో నాకు ఇండియా స్వాగతం చెప్పింది.. అని ఆయన ఉద్వేగంగా వ్యాఖ్యానించారు.

‘నమస్తే ట్రంప్’ పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో ట్రంప్ సతీమణి మెలనియా, కుమార్తె ఇవాంకా, ఆమె భర్త కూడా పాల్గొన్నారు.