IPL 2020 Final: ఐదో టైటిల్‌పై ముంబై.. తొలిసారి కప్పు గెలవాలని ఢిల్లీ..

ఇవాళ దుబాయ్ వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఫైనల్ పోరు జరగనుంది. ఐదో టైటిల్‌పై ముంబై కన్నేయగా.. తొలిసారి కప్పు గెలవాలని ఢిల్లీ కసితో ఉంది.

IPL 2020 Final: ఐదో టైటిల్‌పై ముంబై.. తొలిసారి కప్పు గెలవాలని ఢిల్లీ..
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 10, 2020 | 9:52 AM

IPL 2020 Final: కరోనా కారణంగా ఎంటర్‌టైన్మెంట్‌కు దూరమైన అభిమానులకు దాదాపు రెండు నెలలు పాటు పూర్తి వినోదాన్ని పంచిన ఐపీఎల్ నేటితో ముగియనుంది. ఇవాళ దుబాయ్ వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఫైనల్ పోరు జరగనుంది. ఐదో టైటిల్‌పై ముంబై కన్నేయగా.. తొలిసారి కప్పు గెలవాలని ఢిల్లీ కసితో ఉంది. ఇక ఈ సీజన్‌లో ఇరు జట్లూ మూడుసార్లు తలపడగా.. అన్నింటిలోనూ ముంబై ఇండియన్సే పైచేయి సాధించింది.

ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా ఫైనల్ చేరిన ఢిల్లీ.. క్వాలిఫయర్ 2లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఓపెనర్లు మారడం ఢిల్లీకి కలిసొచ్చింది. ఈసారి కూడా ధావన్, స్టోయినిస్‌లనే ఓపెనింగ్ పంపించాలని ఢిల్లీ యాజమాన్యం భావిస్తోంది. అయితే మిడిల్ ఆర్డర్‌లో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పరుగులు రాబట్టలేకపోవడం, పంత్ నిలకడలేమి, రహానే ఫామ్ ఆ జట్టును ఇబ్బంది పెడుతున్నాయి. అలాగే బౌలర్లు డెత్ ఓవర్లలో పరుగులు ధారాళంగా ఇవ్వడంపై కూడా ఢిల్లీ ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది.

అటు ముంబై ఇండియన్స్‌ మాత్రం అద్భుతమైన ఫామ్‌లో ఉంది. లీగ్ దశ నుంచి ప్లేఆఫ్స్ వరకు సమిష్టిగా విజయాలు సాధిస్తూ వచ్చింది. తొలి క్వాలిఫయర్‌లో కూడా అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లో పూర్తి ఆధిపత్యాన్ని చూపించింది. రోహిత్ శర్మ, డికాక్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, పొలార్డ్, కిషన్‌లతో బ్యాటింగ్ విభాగం బలంగా ఉంటే.. బౌలింగ్‌లో బౌల్ట్, బుమ్రా, పాటిన్సన్, రాహుల్ చాహర్, కృనాల్ పాండ్యాలు ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. మరి ఈ రోజు ఫైనల్‌లో ఏ టీమ్ గెలుస్తుందో వేచి చూడాలి..