
సిద్దిపేటలో గురువారం నాడు జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఇది మామూలు పేట కాదు.. పేరులోనే ఏదో బలం ఉంది. తెలంగాణను సిద్ధింపజేసింది సిద్దిపేట. సిద్దిపేట లేకుంటే కేసీఆర్ లేడు.. కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదు. సిద్దిపేట నుంచి పోయేటప్పుడు ఆణిముత్యంలాంటి నాయకున్ని ఇచ్చి పోయాను. హరీష్ రావు నా పేరు నిలబెట్టాడు. హరీష్ రావు హుషారుమీదున్నడు. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పోతే చాలు అన్నాడు. ఇక్కడికి వచ్చాక ప్రజల ముందు నన్ను నిలబెట్టి సిద్దిపేటకు ఇంకా ఏం కావాలో అన్నీ అడిగేశాడు. సిద్దిపేటకు ఏమేమి కావాలో అన్నీ చేస్తాను. సిద్దిపేట అంటే నాకు ప్రాణం. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిద్దిపేట జిల్లాను చేయాలని విజ్ఞప్తి చేశాం. అయినా ఫలితం లేకపోయింది.’ అని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
సిద్దిపేటపై వరాల జల్లు..
సిద్దిపేట నియోజకవర్గంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లుకురిపించారు. ‘తెలంగాణ రాష్ట్రానికి కరెంట్ సమస్య తిరిపోయింది.. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసే వాళ్ళం. నీటి కష్టాలు తీర్చేందుకు లోయర్ మానేరు నుంచి పైపులు వేసుకుని ఇంటింటికి నీటి సరఫరా చేశాం. నాటి సిద్దిపేట నీటి పథకామే.. ప్రస్తుత మిషన్ భగీరథ పథకం. కాళేశ్వర స్వామి, రంగనాయక స్వామి దయ వల్ల సిద్దిపేటకు 365 రోజులు నీళ్లు నిల్వ ఉండే ప్రాజెక్టు వచ్చింది. రంగనాయక సాగర్ మధ్యలో అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం కోసం 100కోట్లు కేటాయించాం. సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం కాలువ ద్వారా సాగు నీరు అందని గ్రామాల కోసం లిఫ్ట్ మంజూరు చేస్తాం. లిఫ్ట్ కోసం 85కోట్ల కేటాయించాం. లిఫ్ట్ కు ఇర్కోడ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గా నామకరణం చేశాం. 161 కోట్ల రూపాయలతో సిద్దిపేటకు మరో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాం. సిద్దిపేట నుంచి ఇల్లంతకుంట వరకు ఉన్న రోడ్డు 4 లైన్లుగా విస్తరిస్తాం. సిద్దిపేటకు మరో 1000 రెండు పడక గదుల ఇళ్లు కేటాయిస్తాం. సిద్దిపేట 2 పడక గదుల ఇల్లు దేశానికే ఆదర్శంగా ఉంది. ఆ ఇల్లు చూస్తుంటే హృదయం కదిలిపోయింది. కొత్తగా వచ్చే 1000 ఇళ్లు ప్రస్తుత ప్రాంగణంలోనే కట్టాలి. సిద్దిపేటకు 3టౌన్ పోలీస్ స్టేషన్ మంజూరు చేస్తాం. నెల రోజుల్లో బస్తి దవాఖాన ప్రారంభిస్తాం. కోమటి చెరువును కోటి అందాల చేరువుగా హరీష్ రావు మార్చారు. కోమటి చెరువు అభివృద్ధి కోసం మరో 25కోట్ల కేటాయించాం. టౌన్ హాల్ నిర్మాణం కోసం 50 కోట్ల కేటాయించాం. సిద్దిపేటలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం కోసం 25కోట్లు కేటాయించాం. ప్రజాధనాన్ని సద్వినియోగం చేసే నియోజకవర్గం సిద్దిపేట.’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.