AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇన్సూరెన్స్‌ తీసుకోవాలనుకుంటున్న వారికి గుడ్‌న్యూస్‌..! ఇక మరింత చౌకగా బీమా

భారత ప్రైవేట్ భీమా కంపెనీలలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (FDI) కేంద్రం అనుమతించింది. ఆటోమేటిక్ రూట్ ద్వారా వచ్చే ఈ పెట్టుబడులు భీమా రంగంలో పోటీని పెంచి, వినియోగదారులకు మెరుగైన సేవలను అందిస్తాయి. LICకి మాత్రం 20 శాతం FDI పరిమితి కొనసాగుతుంది.

ఇన్సూరెన్స్‌ తీసుకోవాలనుకుంటున్న వారికి గుడ్‌న్యూస్‌..! ఇక మరింత చౌకగా బీమా
Life Insurance
SN Pasha
|

Updated on: May 02, 2026 | 9:45 PM

Share

భారత బీమా రంగంలో విదేశీ పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊతమిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భారతీయ ప్రైవేట్ భీమా కంపెనీలలో 100 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (FDI) అనుమతి లభించనుంది. ఈ పెట్టుబడులు ఆటోమేటిక్ రూట్ ద్వారా రావచ్చు. అంటే ముందస్తు ప్రభుత్వ అనుమతి అవసరం లేకుండానే విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టగలవు. అయితే నియంత్రణ సంస్థల ఆమోదం మాత్రం తప్పనిసరి. ఈ నిర్ణయాన్ని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ కొత్త నిబంధనలు LICకు వర్తించవని ప్రభుత్వం స్పష్టం చేసింది. LICలో విదేశీ పెట్టుబడుల పరిమితి ప్రస్తుతం ఉన్న 20 శాతంగానే కొనసాగుతుంది. దీంతో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజానికి ప్రత్యేక వ్యవస్థ కొనసాగనుంది.

ప్రభుత్వం తీసుకొచ్చిన సబ్కా బీమా, సబ్కీ రక్ష (సవరణ) చట్టం-2025లో భాగంగా ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. భీమా రంగంలో భారీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, మార్కెట్లో పోటీని పెంచడం, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన లక్ష్యాలుగా పేర్కొంటున్నారు. అయితే విదేశీ పెట్టుబడులకు కొన్ని కీలక షరతులు కూడా విధించారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం, విదేశీ పెట్టుబడులు ఉన్న భీమా కంపెనీలలో ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లేదా సీఈఓ వంటి కీలక పదవుల్లో కనీసం ఒకరు భారత పౌరుడై ఉండాలి. అదేవిధంగా విదేశీ వాటా పెరిగిన సందర్భంలో RBI నిర్దేశించిన FEMA నిబంధనలు, ధరల మార్గదర్శకాలను పాటించడం తప్పనిసరి.

ఈ 100 శాతం ఎఫ్‌డీఐ విధానం కేవలం బీమా సంస్థలకే పరిమితం కాకుండా, బీమా బ్రోకర్లు, కార్పొరేట్ ఏజెంట్లు, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్లు (TPAs) వంటి మధ్యవర్తి సంస్థలకు కూడా వర్తించనుంది. అయితే ఇవన్నీ ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా నియంత్రణలో ఉండాల్సి ఉంటుంది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ నిర్ణయం వల్ల బీమా రంగంలో విదేశీ మూలధనం ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. దీనితో కొత్త ఉత్పత్తులు, మెరుగైన టెక్నాలజీ, వేగవంతమైన సేవలు వినియోగదారులకు అందే అవకాశముంది. దీర్ఘకాలంలో భారత భీమా రంగాన్ని మరింత పారదర్శకంగా, పోటీ సామర్థ్యంతో కూడిన మార్కెట్‌గా మార్చేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us