Vatsavai: కార్మిక దినోత్సవం రోజున కార్మికుడికి ఖాకీల లాఠీ ట్రీట్మెంట్..? అసలు ఏం జరిగిందటే..?
జగ్గయ్యపేట పరిధిలో పోలీసుల లాఠీ యాక్షన్‌పై ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఒక పేద సుతారి కార్మికుడిని అనుమానితుడిగా అదుపులోకి తీసుకుని.. మే1న కార్మిక దినోత్సవం రోజున తీవ్రంగా కొట్టినట్లు వార్తలు వస్తున్నాయి.. అసలు ఏం జరిగిందో కథనంలో తెలుసుకుందాం ... ..

ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట పరిధిలోని వత్సవాయి పోలీసుల ప్రవర్తనపై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. వత్సవాయి మండలం డబ్బాకుపల్లి గ్రామానికి చెందిన సయ్యద్ ఇస్మాయిల్ అనే పేద సుతారి కార్మికుడిపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారనే వాదనలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. మే 1న కార్మిక దినోత్సవం రోజునే ఈ ఘటన చోటుచేసుకోవడం మరింత సంచలనంగా మారింది. సమాచారం ప్రకారం, వత్సవాయి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక ఎస్సై, బ్రాస్లెట్ మిస్సింగ్ కేసులో భాగంగా సంబంధిత కార్మికుడిని అనుమానితుడిగా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్రాస్లెట్ కనిపించకుండా పోయి 24 గంటలు గడిచిన తర్వాత ఇస్మాయిల్‌ను పోలీసులు అనుమానితుడిగా పిలిపించినట్లు సమాచారం. బాధితుడి వాంగ్మూలం ప్రకారం, అతడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి మానసిక, శారీరక హింసకు గురిచేసినట్లు పేర్కొన్నాడు.
చేయని నేరాన్ని ఒప్పుకోమని ఒత్తిడి తెచ్చారని, రాత్రి వేళల్లో సీఐ కార్యాలయానికి తరలించి తీవ్రంగా కొట్టినట్లు ఆరోపించాడు. తాను నిర్దోషినని, ఖురాన్‌పై ప్రమాణం చేస్తానని చెప్పినా వినిపించలేదని వాపోయాడు. ఈ ఘటనలో బాధితుడి కాళ్లు వాచిపోయి నడవలేని స్థితికి చేరుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం అతడిని వాహనంలో తీసుకెళ్లి బంధువుల ఇంటి ముందు వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్మిక దినోత్సవం రోజునే ఒక పేద కార్మికుడిపై ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం పట్ల స్థానిక ప్రజా సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులపై వచ్చిన ఈ ఆరోపణలు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. విచారణ అనంతరం అసలు నిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
అసలు కేసు వివరాలు ఇవి:
మక్కపేటలో పెళ్లి అనంతరం పెళ్లి కొడుకు కారులో వెళ్తుండగా.. ఓ చోట వాహనం ఆపారని.. ఆ సమయంలో బ్రాస్లెట్ పోయిందనేది కంప్లైట్. అయితే ఆ తర్వాతి రోజు.. అటువైపు తల్లితో కలిసి బైక్‌పై ప్రయాణించిన సయ్యద్ ఇస్మాయిల్‌కు అది దొరికింది అని కేసు పెట్టినవారి ఆరోపణ. అయితే గాలికి తన జేబులోని కరెన్సీ నోట్లు పడిపోయాయని వాటిని బండి ఆపి తీసుకున్నానని బాధితుడు చెబుతున్నాడు. తనకు బ్రాస్లట్‌తో ఏం సంబంధం లేదని వాపోతున్నాడు. అన్యాయంగా ఈ కేసులో ఇరికింది తనను తీవ్రంగా హింసించారని చెబుతున్నాడు.
అయితే తాము బాధితుడిపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని.. కేవలం 41 సీఆర్‌పీసీ నోటీసు ఇచ్చి విచారించి పంపినట్లు వత్సవాయి ఎస్సై చెబుతున్నాడు. మరి అతనికి తగిలిన దెబ్బలపై ఆస్పత్రి వర్గాల ఇచ్చే రిపోర్ట్‌పై తర్వాతి పరిణామాలు ఆధారపడి ఉన్నాయి..
బాధితుడి వీడియో దిగునవ చూడండి…
