ఇంగ్లండ్‌లో భారత సంతతి వైద్యుడు అనుమానాస్పద మృతి..!

భారత సంతతి వైద్యుడు ఇంగ్లండ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్న సదరు భారతీయుడు ఓ హోటల్‌లో గదిలో శవమై కనిపించాడు

ఇంగ్లండ్‌లో భారత సంతతి వైద్యుడు అనుమానాస్పద మృతి..!

Edited By:

Updated on: May 30, 2020 | 11:45 AM

భారత సంతతి వైద్యుడు ఇంగ్లండ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్న సదరు భారతీయుడు ఓ హోటల్‌లో గదిలో శవమై కనిపించాడు. సోమవారం ఆయన మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.

వివరాల ప్రకారం భారత్‌కి చెందిన రాజేష్ గుప్తా.. సౌత్‌ ఈస్ట్ ఇంగ్లండ్‌లోని బెర్క్‌షైర్‌లో ఉన్న నేషనల్ హెల్త్ సర్వీస్(NHS)ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న వాక్స్‌హమ్‌ పార్క్ ఆసుపత్రిలో అనస్తీషియన్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆ ఆసుపత్రిలో కరోనా బాధితులకు చికిత్స అందిస్తోన్న వైద్యుల్లో రాజేష్ ఒకరు. ఆయన మరణంపై ఎన్‌హెచ్‌ఎస్ ట్రస్ట్ స్పందిస్తూ.. ”డాక్టర్ రాజేష్ గుప్తా ఇక లేరని తెలిపేందుకు చింతిస్తున్నాము. కరోనా నేపథ్యంలో తన కుటుంబ రక్షణ కోసం ఓ హోటల్‌లో ఉంటోన్న రాజేష్ సోమవారం మృతి చెందారు. ఆయన మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మా ట్రస్ట్‌లో అందరికీ ఆయన బాగా తెలిసిన వ్యక్తి” అని తెలిపింది.

మరోవైపు ఆయన మరణంపై సహోద్యోగులు సంతాపం ప్రకటించారు. ”రాజేష్ చాలా దయగల వ్యక్తి. అంతేకాదు ఒక మంచి కవి, ఆర్టిస్ట్, ఫొటోగ్రాఫర్‌, కుక్‌ కూడా. ఆయన పలు పుస్తకాలు కూడా రాశారు. ఆయనను కచ్చితంగా మిస్ అవుతాం” అని వారు చెప్పారు. కాగా రాజేష్‌కి ఒక భార్య, కుమారుడు ఉండగా.. వృత్తిపరంగా ఇటీవలే ఆయనకు ప్రమోషన్‌ వచ్చినట్లు సమాచారం.

Read This Story Also: కరోనా అప్‌డేట్స్‌: 60లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు..!