భారత్, చైనాల మధ్య గత కొంతకాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొంటున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో చైనా తరచూ నిబంధనలను అతిక్రమిస్తూ భారత్‌ను కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య వ్యవహారంలోనూ జోక్యం చేసుకుని పాకిస్తాన్‌కు మద్దతు తెలిపేలా చైనా వ్యవహరించింది. ఇవన్నీ పక్కనపెడితే.. తాజాగా మరోసారి చైనా దుస్సాహానికి దిగింది. హిమాలయ సరిహద్దు ప్రాంతాల్లో భారత్, చైనాల మధ్య వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా చైనా మయన్మార్ సరిహద్దు ప్రాంతంలోని పలు తిరుగుబాటు గ్రూపులకు చైనా సాయం చేస్తోందని భారత అధికారులు చెబుతున్నారు. మయన్మార్‌లోని సాయుధ బృందాలతో పాటు ఈ ఏడాది ఉగ్రవాద సంస్థగా రూపుదిద్దుకున్న యునైటెడ్ వా స్టేట్ ఆర్మీ, అరకాన్ ఆర్మీ సంస్థలతో పాటు భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లోని తిరుగుబాటు దళాలకు సైతం ఆయుధాలను సరఫరా చేస్తోన్నట్టు భారత అధికారులు గుర్తించారు.
దక్షిణ చైనా నగరమైన కున్మింగ్‌లో ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాద సంస్థలకు చెందిన నాయకులతో అక్టోబరు నెలలో ఆయుధాలపై శిక్షణ ఇచ్చారని తెలుస్తోంది. భారత్- మయన్మార్ సరిహద్దులోని మాతృభూమి కోసం పోరాడుతున్న ముగ్గురు తిరుగుబాటుదారులతో సహా మరికొంతమందికి ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు రిటైర్డ్ చైనా సైనికాధికారులతో అన్‌అఫీషియల్ నెట్‌వర్క్‌ను తయారు చేసేందుకు సమావేశమైనట్టు భారత అధికారులు చెప్పారు. మయన్మార్ సరిహద్దులో జరుగుతున్న కార్యకలాపాలతో న్యూఢిల్లీలో ఆందోళనకర వాతావరణాన్ని సృష్టించిందనే చెప్పాలి. ఇప్పటికే భారత్‌కు చైనా, పాకిస్తాన్ దేశాలతో భూసరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మయన్మార్ సరిహద్దు ప్రాంతంలోకి వేలాది మంది సైనిక బృందాలను ఇప్పటికే తరలించారని అధికారులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై చైనా అధికారులు స్పందిస్తూ.. చైనా ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోదని, భారతదేశానికి వ్యతిరేకంగా సాయుధ బృందాలకు మద్దతు ఇస్తోందనడం అవాస్తవమని ఖండించింది. చైనా ఆయుధ ఎగుమతుల పట్ల బాధ్యతయుతమైన వైఖరిని తీసుకుంటుందని గుర్తు చేశారు. భారత్ భద్రతతో మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇండియాకు హాని చేయాలని మేం ఎప్పుడూ అనుకోబోము. అలాంటి ఆరోపణలపైనా మేం స్పందించాల్సిన అవసరం లేదంటూ యునైటెడ్ వా స్టేట్ ఆర్మీ ప్రతినిధి నై రాంగ్ వ్యాఖ్యానించారు.