Robert Vadra : సోనియా అల్లుడిపై కేసులేమీ బలహీనపడలేదు. మధ్య మధ్యలో కాస్త గ్యాప్ వస్తోందంతే. రాబర్ట్‌వాద్రాపై ఆదాయపు పన్నుశాఖ మరోసారి కన్నేసింది. బినామీ ఆస్తుల వ్యవహారంలో రాబర్ట్‌వాద్రాని ఇంటికెళ్లి ఐటీ అధికారులు విచారించారు. యూకేలోని ఆయుధ వ్యాపారి సంజయ్ భండారి ద్వారా కొనుగోలు చేసిన లండన్ ఆస్తులతో ముడిపడి ఉన్న కేసులో ఆదాయపు పన్నుశాఖ విచారణ జరిపింది. లండన్‌లో కోట్ల విలువైన ఆస్తుల కొనుగోలుపై ఐటీ ఆరాతీస్తోంది. పన్ను ఎగవేతపై ఢిల్లీలోని నివాసంలో రాబర్ట్ వాద్రా స్టేట్‌మెంట్‌ను ఐటీ శాఖ అధికారులు రికార్డు చేశారు.
యూకేలో మూడు ఆస్తుల కొనుగోలు కేసులో ఇప్పటికే వాద్రాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారిస్తోంది. వీటితో పాటు ఆరు ఫ్లాట్లు కూడా వాద్రావేనని ఈడీ అనుమానిస్తోంది. 2005-2010 సంవత్సరాల మధ్యకాలంలో ఈ ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఈడీ గుర్తించింది.
లండన్‌లో మొత్తం 12 బిలియన్‌పౌండ్ల ఆస్తులున్నాయనే అభియోగాలతో ఈడీ విచారణ జరుగుతోంది. పన్ను ఎగవేతపై రాబర్ట్‌వాద్రాకు ఇంతకుముందే ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. అయితే విచారణకు హాజరుకాకపోవడంతో ఐటీ శాఖ అధికారులే వాద్రా నివాసానికి వచ్చారు. బికనీర్, ఫరాదాబాద్ భూ కుంభకోణాలతో సహా బినామీ ఆస్తుల కేసుల్లో స్టేట్‌మెంట్ తీసుకున్నారు.
ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీ ద్వారా యూకేలో ఆస్తుల కొనుగోలుపై 2018లో రాబర్ట్‌వాద్రాపై మనీ లాండరింగ్ కేసు నమోదైంది. రాజస్థాన్‌లోని బికనీర్‌లో పేద ప్రజల పునరావాసం కోసం ఉద్దేశించిన భూమిని వాద్రాకు చెందిన స్కై లైట్ హాస్పిటాలిటీ సంస్థ సేకరించిందన్న ఆరోపణపై 2015లో మనీ లాండరింగ్ కేసు నమోదైంది.
రాబర్ట్ వాద్రా 69.55 ఎకరాల భూమిని అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి అక్రమ లావాదేవీల ద్వారా ఎలెజెన్సీ ఫిన్‌లీజ్‌కు రూ.5.15 కోట్లకు అమ్మినట్టు ఆరోపణలున్నాయి. గుర్గావ్ ల్యాండ్ డీల్స్‌లో వాద్రాతో పాటు.. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాపైనా 2018లో పోలీసు కేసు నమోదైంది. ఇన్ని కేసులు నమోదువుతున్నా, వరుసగా దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నా.. ఆరోపణలు నిరాధారమని సోనియా అల్లుడు అంటున్నారు.