Jai Bhim: నేనూ ఇలాంటి దారుణాలు చూశాను.. హైదరాబాద్‌లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి.. ‘జై భీమ్‌’ సినిమాపై ఐఏఎస్ అధికారి స్పందన..

|

Nov 06, 2021 | 4:15 PM

తమిళ హీరో సూర్య నటించిన తాజా చిత్రం 'జై భీమ్‌'. జ్ఞానవేల్‌ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొన్ని యదార్థ సంఘటనల..

Jai Bhim: నేనూ ఇలాంటి దారుణాలు చూశాను.. హైదరాబాద్‌లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి.. జై భీమ్‌ సినిమాపై  ఐఏఎస్ అధికారి స్పందన..
Follow us on

తమిళ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘జై భీమ్‌’. జ్ఞానవేల్‌ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా సమాజంలో అణగారిన వర్గ ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు పెద్ద మనుషులు చేస్తున్న దారుణాలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. అన్యాయంగా ఓ కేసులో చిక్కుకున్న పేద కుటుంబం తరఫున పోరాడే లాయర్‌ పాత్రలో సూర్య నటించారు. జ్యోతిక దంపతులు సొంత బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రం పలువురి ప్రశంసలు అందుకుంటోంది. ఇటీవల ఈ సినిమాను చూసిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ‘నా హృదయం బరువెక్కింది. రాత్రంతా నిద్రపట్టలేదు’ అంటూ ఓ లేఖను కూడా విడుదల చేయడం విశేషం.

నేనూ ఇలాంటి దారుణాలు చూశాను..
ప్రస్తుతం సోషల్‌ మీడియాలో కూడా ‘జై భీమ్‌’ బాగా ట్రెండ్‌ అవుతోంది. పలువురు ప్రముఖులు ఈ సినిమాను చూస్తూ తమ అభిప్రాయలను పంచుకుంటున్నారు. తాజాగా ఈ సినిమాను ప్రముఖ ఐఏఎస్‌ అధికారి  గంధం చంద్రుడు వీక్షించారు. ఈ సందర్భంగా సినిమాలోని ఓ సన్ని వేశాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. జైల్లో కొందరు ఖైదీలను పోలీసులు దారుణంగా హింసించే సన్నివేశం అది. దీనిని చూసిన కలెక్టర్‌ తన జీవితంలోనూ ఇలాంటి దారుణం ఒకటి జరిగిందంటూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అప్పటి సంఘటన వివరాలను షేర్‌ చేశారు.. ‘ఇలాంటి సన్నివేశాలు నిజ జీవితంలో చాలా సార్లు జరిగినవే.. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మారుమూల గిరిజన ప్రాంతాల్లోనే కాదు హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో కూడా ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి’

‘2011 సంవత్సరంలో మెదక్ జిల్లా పటాన్ చెరువులో ఒక వ్యక్తి పోలీసుల కస్టడీలో మరణించాడు. అప్పుడు నేను జిల్లా కలెక్టర్‌ అసిస్టెంట్‌ (ట్రైనీ)గా ఉన్నాను. అండర్ ట్రయల్ ఖైదీ కస్టడీ మరణానికి గల కారణాలను తెలుసుకోవడానికి నన్ను మెజిస్టీరియల్ విచారణ అధికారిగా నియమించారు. విచారణంలో భాగంగా.. జైలు, మార్చురీ, ఆస్పత్రిని సందర్శించాను. ఖైదీ మరణానికి బాధ్యులైన పోలీసు సిబ్బందిని విచారించాను. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించాను. ఆ నివేదిక ఆధారంగా ఖైదీ మరణానికి కారకులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది’ అని అప్పటి సంఘటనను గుర్తుకు చేసుకున్నారు.

Also Read:

Sooryavanshi: బాలీవుడ్‌లో ‘సూర్యవంశీ’ సందడి.. ఇండస్ట్రీ కాన్ఫిడెన్స్ పెంచేసిన అక్షయ్ కుమార్ మూవీ

Chiranjeevi: చిరు అంటే సీన్ ఇలా ఉంటది.. ఐదుగురు టాప్ డైరక్టర్ల సమక్షంలో మెగాస్టార్ 154వ మూవీ లాంచ్

Jayamma Panchayathi: పంచాయితీ పెద్దగా మారిన సుమ.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్..