AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: రోడ్డు ప్రమాదం అనుకున్నారు.. కానీ అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఓ వ్యక్తి హత్య కేసును ఉప్పల్‌ మేడిపల్లి పోలీసులు ఛేదించారు. తొలుత రోడ్డు ప్రమాదంగా భావించిన ఈ ఘటన వెనుక హత్య ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మృతుడి భార్య సునీతే హత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. హతమార్చి ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.

Hyderabad: రోడ్డు ప్రమాదం అనుకున్నారు.. కానీ అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!
Wife Kill Husband
Balaraju Goud
|

Updated on: Aug 17, 2026 | 7:22 PM

Share

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఓ వ్యక్తి హత్య కేసును ఉప్పల్‌ మేడిపల్లి పోలీసులు ఛేదించారు. తొలుత రోడ్డు ప్రమాదంగా భావించిన ఈ ఘటన వెనుక హత్య ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మృతుడి భార్య సునీతే హత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. హతమార్చి ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పీర్జాదిగూడ, రాఘవేంద్ర కాలనీలో సత్యనారాయణ (51), సునీత (44) దంపతులు నివసిస్తున్నారు. ఆగస్టు 6వ తేదీన సత్యనారాయణ మద్యం సేవించడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా సత్యనారాయణ తన భార్యను దూషిస్తూ మానసికంగా వేధించినట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు పేర్కొన్నారు.

భర్త ప్రవర్తనతో ఆగ్రహానికి గురైన సునీత.. అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. తన పథకం ప్రకారం సత్యనారాయణ చేతులు, కాళ్లను చీరతో కట్టి.. సెంట్రింగ్ కర్రతో తలపై, శరీరంలోని ప్రైవేట్ భాగాలపై తీవ్రంగా కొట్టినట్లు వెల్లడించారు. దాడిలో తీవ్ర గాయాలపాలైన సత్యనారాయణ స్పృహ కోల్పోయాడు.

అనంతరం తన కుమారుడు నికిత్‌కు ఫోన్ చేసిన సునీత.. తన తండ్రి వాహనం నుంచి ప్రమాదవశాత్తు జారిపడి గాయపడినట్లు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన సత్యనారాయణను బోడుప్పల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్ట్‌మార్టం, వైద్యుల అభిప్రాయం, సంఘటనా స్థల పరిశీలనతో పాటు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఎలాంటి రోడ్డు ప్రమాదం జరిగినట్లు ఆధారాలు లభించకపోవడంతో భార్య సునీతపై అనుమానం కలిగింది. విచారణలో సునీత తన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె చూపించిన ప్రదేశం నుంచి మృతుడి చేతులు, కాళ్లు కట్టేందుకు ఉపయోగించిన చీర, దాడికి ఉపయోగించిన కర్రను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా హత్యలో ఆమె ప్రమేయం నిర్ధారణ అయినట్లు పోలీసులు వెల్లడించారు.

దీంతో తొలుత నమోదు చేసిన సెక్షన్ 106(1) BNS కింద రోడ్డు ప్రమాద కేసును.. హత్యకు సంబంధించిన సెక్షన్లు 103(1), 238 BNS కింద మార్చారు. నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసులో సేకరించిన ఆధారాలు, ఇతర అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us