బోరబండలో రెండు భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 0.8గా నమోదు

భాగ్యనగరం ఉన్నట్టుండి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భారీ శబ్దాలు బోరబండ వాసులను వణికిస్తున్నాయి. మూడు రోజుల వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించడంతో జనం బెంబేలెత్తుతున్నారు. మళ్లీ మళ్లీ ప్రకంపనలు వస్తుండడంతో.. ప్రజలు కలవరానికి గురవుతున్నారు.

బోరబండలో రెండు భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 0.8గా నమోదు
Earthquake

భాగ్యనగరం ఉన్నట్టుండి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భారీ శబ్దాలు బోరబండ వాసులను వణికిస్తున్నాయి. మూడు రోజుల వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించడంతో జనం బెంబేలెత్తుతున్నారు. మళ్లీ మళ్లీ ప్రకంపనలు వస్తుండడంతో.. ప్రజలు కలవరానికి గురవుతున్నారు.. దీంతో ఏం జరుగుతుందో తెలియక స్థానికులు జాగారం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం వచ్చిన మాదిరిగానే ఈసారి కూడా భారీ ప్రకంపనలు వస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు. అదే పరిస్థితే మళ్లీ రిపీట్‌ అవుతోందని కలవరంతో కంటిమీద కునుకు లేకుండా చేస్తో్ంది.

హైదరాబాద్ లోని బోరబండతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వాసులను కూడా శబ్దాల భయం వెంటాడుతోంది. అక్టోబర్‌2న రాత్రి సమయంలో వచ్చిన ప్రకంపనల తీవ్రత రిక్టార్ స్కేల్ పై 1.4గా ఉండగా.. ఆదివారం ఉదయం 0.8గా ఉన్నట్టు నమోదైంది. మూడు రోజుల్లో రెండు సార్లు భూమి కంపించడంతో స్థానికులు టెన్షన్‌ పడుతుండగా.. అధికారులు మాత్రం ధైర్యం చెప్పే యత్నం చేస్తున్నారు. నీటి ఒత్తిడి ఎక్కువై గాలి బయటకు వచ్చే సమయంలో ఒక్కసారిగా శబ్దం రావడం సహజమని అంటున్నారు. ఇది భూకంపం కాదని అధైర్య పడొద్దని సూచిస్తున్నారు. అయినా జనంలో మాత్రం ఆ వణుకు తగ్గడం లేదు అప్పుడప్పుడు వచ్చే శబ్దాలకు.. ఇళ్లు ఎక్కడ కూలిపోతాయోనని బోరబండవాసులు ఆందోళనకు గురవుతున్నారు. 25 ఏళ్ల క్రితం తర్వాత మూడేళ్ల క్రితం ఇలాంటి శబ్దాలు వచ్చాయని, మళ్లీ ఇప్పుడు వస్తున్నాయని అంటున్నారు. శబ్దాల టెన్షన్‌ను తట్టుకోలేక కొందరు తమ బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు.

బోరబండలో వస్తున్న శబ్దాల నేపథ్యంలో NGRI శాస్త్రవేత్తలు ఆ కాలనీల్లో పర్యటించారు. భూప్రకంపనలు, అందుకు గల కారణాలను తెలుసు.కునేలా మూడు ప్రాంతాల్లో సిస్మోగ్రాఫ్‌ పరికరాలను అమర్చారు. అక్టోబర్‌2న వచ్చిన ప్రకంపనల తీవ్రత 1.4గా ఉండగా.. ఇవాళ వచ్చినవి 0.8గా ఉన్నట్టు నమోదైంది. చాలా తక్కువగానే ఉందని, భయపడాల్సిన పనిలేదని శాస్త్రవేత్తలు ధైర్యం చెబుతున్నారు. శబ్దాల తీవ్రతను గుర్తించేలా నాట్కో స్కూల్‌, సాయిబాబా నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌, NRR పురంలో సైట్‌ 4-5 ప్రాంతాల్లో ఈ సిస్మోగ్రాఫ్‌లను పెట్టారు. ఎప్పటికప్పుడు భూమి నుంచి వచ్చే శబ్దాల తీవ్రతను ఇవి అంచనా వేస్తాయి. అంతేకాకుండా, బోరబండ గుట్టలతో ఉన్న ఎత్తైన ప్రాంతం కావడంతో భూమి లోపలు ఏర్పడే సర్ధుబాట్లు కారణంగా ఇలాంటి శబ్ధాలు వస్తాయని శాస్త్రవేత్తలు చెప్పినట్లు స్థానికులు తెలిపారు. ఈ మధ్య పడిన వర్షాలకు నీరు గుట్టల నుంచి భూమిలోకి వెళ్తున్నందున.. ఆ సమయంలో భూమి పొరల్లో ఉండే గాలి బయటకు వచ్చేయత్నంలోనే ఈ శబ్దాలు వస్తున్నట్టుగా శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారన్నారు. అయినా తమను భయం వెంటాడుతోందని… ఇళ్లలోకి వెళ్లాలంటేనే వణుకు పుడుతోందని ప్రజలు కలవరపడుతున్నారు.

Click on your DTH Provider to Add TV9 Telugu