ఆర్టీసీ సమ్మె కారణంగా మెట్రో జోరందుకుంది. సోమవారం 3.80 లక్షల మంది ప్రయాణికులతో రికార్డు బద్దలు కొట్టింది. ఇటీవల 3.75 లక్షల మందితో రికార్డు బ్రేక్ చేయగా.. సోమవారం రద్దీ ఎక్కువగా ఉండటంతో 3.80లక్షలకు చేరుకుంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మెజార్టీ సిటిజనులు మెట్రోలోనే ప్రయాణిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు పలు రూట్లలో మెట్రో రైళ్లు రద్దీగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎల్బీనగర్-మియాపూర్ రూట్లోని ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, ఎంజీబీఎస్, నాంపల్లి, అమీర్‌పేట్, మియాపూర్ స్టేషన్లలో రద్దీ అనూహ్యంగా పెరిగిందని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇక నాగోల్ టు హైటెక్ సిటీ రూట్‌లో నాగోల్, ఉప్పల్, తార్నాక, మెట్టుగూడా, సికింద్రాబాద్, బేగంపేట్, హైటెక్ సిటీ స్టేషన్లు రికార్డు సంఖ్యలో ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయని మెట్రో అధికారులు చెబుతున్నారు. మామూలు రోజులతో పోలిస్తే.. సోమవారం ఎక్కువ సంఖ్యలో సిటిజన్లు మెట్రోలో ప్రయాణం చేసినట్లు తెలుస్తోంది. గత వారం రోజులకు పైగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని.. పలు స్టేషన్లలో ప్రత్యేక టికెట్ కౌంటర్లు, అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు.