Hyderabad city buses : కోవిడ్ నేపథ్యంలో ఆరు నెలలుగా నిలిచిపోయిన హైదరాబాద్ సిటీ బస్సులు రేపటి(శుక్రవారం) నుంచి రోడ్డెక్కనున్నాయి. శుక్రవారం నుంచి 25 శాతం బస్సులు నడపనున్నట్లు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. బుధవారం నగర శివారు ప్రాంతాలైన రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ, హకీంపేట, ఫలక్‌నుమా, మిథాని, మియాపూర్, హయత్‌నగర్ డిపోల నుంచి పాక్షికంగా బస్సులు ప్రారంభమయ్యాయి.
ఈ డిపోల నుంచి 12 చొప్పున సర్వీసులను నడిపినట్లు తెలుస్తోంది. సిటీ సబర్బన్ ప్రాంతాలకు 15 కిలోమీటర్ల పరిధిలో బస్సులు నడిపారు. శివారు గ్రామాల్లోని ప్రయాణికుల అభ్యర్థన మేరకు బస్సులను ప్రారంభించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. గతంలో బస్సులో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండేది. ఇకపై ఆ పరిస్థితి లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోనున్నారు.