మహాత్మాగాంధీ 150 జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలో పలువురు ప్రముఖులు, సెలబ్రెటీలను విందుకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. మహాత్ముడి మార్గాలు, ఆశయాల గురించి వారితో అనేక విషయాలను ఈ సందర్భంగా ఆయన పంచుకున్నారు. అంతేకాక దేశ ప్రజలకు అవి చేరువయ్యేలా చూడాలని వివరించారు. ఇక బాలీవుడ్ సెలబ్రిటీలు కొందరు ప్రధాని మోదీతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. దక్షిణాది ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా రామ్ చరణ్ సతీమణి ట్విట్టర్ వేదికగా తన అసహనాన్ని వ్యక్తం చేసింది. బాలీవుడ్ సెలబ్రిటీలతో పోలిస్తే.. దక్షిణాది ప్రముఖులను అంతగా పట్టించుకోని వైనం దాదాపు దుమారం రేపింది. హిందీ ఆర్టిస్టులను మాత్రమే హైలైట్ చేస్తూ.. సౌత్ దిగ్గజాలను నిర్లక్ష్యం చేశారని.. టాలీవుడ్ పరిశ్రమను చెందిన అనేక మంది ప్రముఖులను పూర్తిగా పట్టించుకోలేదని.. ఇది ఎంతో బాధాకరమని ఆమె ట్వీట్ చేసింది.
ఇలా ఆమె పోస్ట్ చేసిన వెంటనే.. నెటిజన్లు కూడా ప్రధాని మోదీ తీరును తీవ్రంగా విమర్శించారు. నెట్టింట్లో ఇదొక హాట్ టాపిక్‌గా మారితే.. చివరికి పీఎంఓ దీనిపై క్లారిటీ ఇచ్చింది. దక్షిణాది నుంచి పలువురు ప్రముఖులను ఈ మీటింగ్‌కు పిలవడం జరిగిందని.. రకుల్ ప్రీత్ సింగ్, సాలూరి వాసూరావు, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, దిల్ రాజు, ఈనాడు ఎండీ కిరణ్, ఈటీవి సీఈఓ బాపినీడు తదితరులు హాజరయ్యారని తెలిపింది.