
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకి సంబంధించి బీఎల్ సంతోష్, జగ్గుస్వామి సిట్ నోటీసులపై స్టేను మరికొంతకాలం పొడిగించింది హైకోర్టు. ఈ నెల 22వరకు స్టే పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక సీబీఐతో విచారణ జరిపించాలన్న పిటిషన్‌ను రేపటికి వాయిదా వేసింది. బీఎల్ సంతోష్, జగ్గుస్వామిలకు 41-A సీఆర్పీసీ నోటీసులకు సంబంధించి హైకోర్ట్‌లో సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ఫామ్ హౌస్ ఎపిసోడ్ స్పాట్‌లో ఉన్నది ముగ్గురు మాత్రమే.. బీఎల్ సంతోష్, జగ్గుస్వామిలు లేకున్నా వారి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారని వాదించారు పిటిషనర్ల తరఫు న్యాయవాది. కేవలం ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్‌లో ఫోటోలు, చాటింగ్ ఆధారంగా నిందితులుగా ఎలా పేర్కొంటారని ప్రశ్నించారు. అలాగే సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌పై ఇంకా తీర్పు రావాల్సి ఉంది. ఈలోపే ప్రతిపాదిత నిందితుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలని ఏజీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పిటిషనర్ల కౌన్సిల్ వాదనతో ఏకీభవించిన హైకోర్ట్ బీఎల్ సంతోష్, జగ్గుస్వామిల స్టే పిటిషన్‌ను 22 వరకు పొడిగించింది.
మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐతో విచారణ జరిపించాలన్న పిటిషన్‌పై హైకోర్ట్‌లో 2 గంటల పాటు వాదనలు కొనసాగాయి. విచారణ పేరుతో పోలీసులు అడ్వొకేట్ శ్రీనివాస్‌ను ఆయన కుటుంబాన్ని టార్చర్ పెడుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బీజేపీ నేతల పేర్లు చెప్పాలని సిట్ అధికారులు ఒత్తిడి తెస్తున్నారని కూడా వాదించారాయన. సిట్ విచారణలో దొరికిన సాక్ష్యాలను ఫిర్యాదుదారుడు సీఎంకు ఇచ్చి ఉంటారని ఏజీ చెప్పడాన్ని మరో న్యాయవాది తరఫు అడ్వొకేట్ వాదించారు. ఇది సిట్ తన పరిధి దాటి వ్యవహరించడమే అవుతుందన్నారు. రేపు ప్రభుత్వ వాదనలు విననున్న హైకోర్ట్.. ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దూకుడు కొనసాగుతూనే ఉంది. లేటెస్ట్‌గా జగ్గుస్వామి సోదరుడు మనీలాల్‌కు నోటీసులిచ్చింది. విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. మనీలాల్ మాత్రం ముందస్తు బెయిల్ కోసం హైకోర్ట్‌ను ఆశ్రయించారు. అయితే న్యాయస్థానం బెయిల్ ఇస్తుందా? లేదా అన్నది చూడాలి.