పార్లమెంటులో ప్రభుత్వం తన గొంతు నొక్కజాలదని అన్నారు కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం.. బుధవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి విడుదలైన వెంటనే ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసానికి వెళ్లి ఆమెతో భేటీ అయ్యారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన చిదంబరం 106 రోజులపాటు జైలు జీవితం గడిపారు. రాజ్యసభ సభ్యుడైన ఆయన.. దేశంలో కొండెక్కిన ఉల్లి ధరలకు నిరసనగా గళమెత్తిన ఇతర కాంగ్రెస్ ఎంపీలతో గొంతు కలిపారు. ఈ సమస్యతో బాటు దేశం ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై పార్లమెంటులో తన వాణిని వినిపిస్తానని ఆయన చెప్పారు. కాగా-ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం దేశం విడిచి వెళ్లరాదని, ఈడీ అధికారుల విచారణకు ఎప్పటికప్పుడు హాజరు కావాలని సుప్రీంకోర్టు షరతులు విధించిన సంగతి విదితమే..